* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
* ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించాలి
* విద్యార్థులను ఉపాధ్యాయులు స్వంత బిడ్డలుగా చూసుకోవాలి
ఆకేరు న్యూస్ ,స్టేషన్ ఘనపూర్: బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, ఏ రంగంలోనైనా రాణించే సత్తా వారికి ఉందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వేలేరు మండలం గొల్లకిష్టంపల్లి కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.పాఠశాలలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రూ. 1.28 కోట్లతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు..పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించే బాధ్యత తనదేనని, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని ఆయన అన్నారు. దేశంలోనే అత్యధికంగా 1700 గురుకుల పాఠశాలలు తెలంగాణలో ఉన్నాయని, అందులో 10 లక్షల మంది చదువుతుంటే, 6 లక్షల మంది బాలికలే ఉండటం గర్వకారణమని తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పరిధిలోని 7 కేజీబీవీలకు రూ. 9.20 కోట్లు మంజూరు చేశామని, గొల్లకిష్టంపల్లి పాఠశాలకు మొత్తం రూ. 6 కోట్ల వరకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూ. 200 కోట్లతో నిర్మించే ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ను కూడా నియోజకవర్గంలో బాలికలకే కేటాయించినట్లు ప్రకటించారు.బాలికలు నాణ్యమైన విద్యనభ్యసిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, దానికి అతిచిన్న వయసులోనే ఐఏఎస్ సాధించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ నిదర్శనమని ఎమ్మెల్యే కొనియాడారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. వేలేరు మండలంలో బాలికల లింగ నిష్పత్తి తక్కువగా ఉండటంపై విశ్లేషణ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వెయ్యి మంది బాలురకు 932 మంది బాలికలు ఉంటే, ఈ మండలంలో 832 మాత్రమే ఉండటంపై సర్పంచులు, ప్రజలు చొరవ చూపి అవగాహన కల్పించాలని కోరారు. ఆడపిల్లలు చదువుకుని స్వయం సమృద్ధి సాధిస్తే ఏ తల్లిదండ్రులకూ భారం కాదని హితవు పలికారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఎమ్మెల్యే, కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిట్‌ను చూసి, పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో డీఈవో గిరిరాజ్ గౌడ్, తహసీల్దార్ కొమి, ఎంపిడివో లక్ష్మీ ప్రసన్న, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సృజన, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

…………………………………………..
