చైర్మన్ ఎన్నికపై బీఆర్ఎస్ సవాల్
ఆకేరు న్యూస్,మహబూబాబాద్: తొర్రూర్ మున్సిపాలిటీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మెజార్టీ తమకే ఉందని బీఆర్ఎస్ వాదిస్తుండగా, ఎక్స్ అఫిషియో ఓట్ల వ్యవహారం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది.ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తొర్రూర్ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా తామే విజయం సాధించామని ఆయన స్పష్టం చేశారు.మొత్తం 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఐకమత్యంగా ఉన్నారని, మెజార్టీ స్థానాలు గెలిచిన తమకే చైర్మన్ పీఠం దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.ఎంపీ కడియం కావ్యకు సంబంధించిన ఎక్స్ అఫిషియో ఓటు నమోదుపై ఎర్రబెల్లి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2025లో ఆమె తన ఎక్స్ అఫిషియో ఓటును వరంగల్లో నమోదు చేసుకున్నారని, ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఓటు వేయాలని చూడటం సరికాదని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని ఉపయోగించి, అక్రమ మార్గాల్లో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ కావ్య ఓటును పరిగణనలోకి తీసుకుంటే, తాము న్యాయపోరాటం చేస్తామని, కోర్టును ఆశ్రయిస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు.ప్రస్తుతం 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసుకు చేరుకోవడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
