Uppal Bus Stand Sanitation
* మరుగుదొడ్లు నిరుపయోగంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ బస్టాండ్ ప్రస్తుతం తీవ్ర పారిశుద్ధ్య లోపంతో కొట్టుమిట్టాడుతోంది. ఉప్పల్ రైల్వే స్టేషన్ ద్వారా రైలు ప్రయాణ సౌలభ్యం ఉండటం నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఈ బస్టాండ్ నుంచి ప్రయాణాలు సాగిస్తారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాలైన భూపాలపల్లి, కాటారంతో పాటు హుజురాబాద్, హన్మకొండ, పరకాల, జమ్మికుంట మార్గాల్లో వెళ్లే వారికి కూడా ఈ ఉప్పల్ బస్టాండే ఆధారం. అయితే, నిత్యం ఇంతటి రద్దీతో ఉండే ఈ బస్టాండ్ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రతకు నిలయంగా మారింది.

* మరుగుదొడ్ల దుస్థితితో మహిళలు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
బస్టాండ్ ప్రాంగణమంతా దుమ్ము, ధూళి, ఖాళీ వాటర్ బాటిళ్లతో నిండిపోవడమే కాకుండా.. ఏండ్లుగా ఇక్కడి బస్టాండ్ లోని మరుగుదొడ్ల నిర్వహణ పూర్తిగా గాలికొదిలేశారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండే సుదూర ప్రాంతాల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చిన్న పిల్లలు అత్యవసర సమయాల్లో ఈ మరుగుదొడ్లను ఉపయోగించలేక, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లలేక, ఇటు బస్టాండ్లో ఉన్నవాటిని వాడుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

* ప్రయాణికుల ఆవేదన
రైల్వే స్టేషన్కు వెళ్లాలన్నా, వేరే ఊర్లకి బస్సు ఎక్కాలన్నా మాకు ఇదే దిక్కు. కానీ ఇక్కడి టాయిలెట్లు చూస్తే అసలు మనుషులు వెళ్లేలా లేవు. ఆడవాళ్లు, వృద్ధుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అధికారులు కనీసం సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణం.
నిత్యం దాదాపు 500 మంది ప్రయాణించే ఈ రద్దీ బస్టాండ్లో మరుగుదొడ్ల నిర్వహణను ఏళ్లుగా గాలికి వదిలేశారు. ఏండ్ల క్రితమే ఇక్కడ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ సరైన పర్యవేక్షణ లేక నిరుపయోగంగా మారాయి. అధికారులు వెంటనే స్పందించి, ఈ మరుగుదొడ్ల నిర్వహణను చేపట్టి బస్టాండ్లో ప్రయాణికులకు అవసరమైన కనీస సదుపాయాలను మెరుగుపరచండి.
– ఎర్రబెల్లి శ్రీధర్ రావు స్థానిక వార్డ్ మెంబర్
* పారిశుద్ధ్య సిబ్బంది నియామకం చేపట్టాలి
ఉప్పల్ సర్పంచ్ రమా – నాగరాజు డిమాండ్ బస్టాండ్లో ఏండ్లుగా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పని మానివేయడంతోనే ఈ సమస్య మరీ జటిలమైందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ రమా – నాగరాజు తీవ్రంగా స్పందించారు. బస్టాండ్లో పారిశుద్ధ్య లోపాన్ని, మరుగుదొడ్ల దుస్థితిని వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా హుజురాబాద్ డిపో మేనేజర్ వెంటనే స్పందించి, తక్షణమే కొత్త పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని, నీటి సౌకర్యం పునరుద్ధరించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రయాణికులతో కలిసి ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

