ఆకేరు న్యూస్,మహబూబాబాద్: తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న తరుణంలో, బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఖాయం చేసేందుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్యవతి రాథోడ్‌ను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ క్రమంలో ఆమె పార్టీ వ్యూహాలను అమలు చేస్తూ, కౌన్సిలర్లను సమన్వయం చేసే పనిలో నిమగ్నమయ్యారు.నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం కావడంతో, కురవిలో నిర్వహించిన వేడుకల్లో సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అక్కడ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం, ఆమె నేరుగా తొర్రూరు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె మహబూబాబాద్‌లోని తన నివాసానికి చేరుకోగానే పోలీసులు భారీగా మోహరించి బయటకు రాకుండా అడ్డుకున్నారు.శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా, తొర్రూరులో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకే ఈ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను ప్రభుత్వం పోలీసు బలగాలతో ప్రభావితం చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆందోళన చేపట్టారు.
