క్యాతనపల్లిలో పోలీసుల లాఠీఛార్జ్
ఆకేరు న్యూస్, మంచిర్యాల: జిల్లాలోని క్యాతనపల్లిలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి లక్ష్యంగా రాళ్ల దాడి జరగడం కలకలం రేపింది. క్యాతనపల్లి పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాగ్వాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఈ ఘర్షణ సమయంలో అక్కడికి చేరుకున్న మంత్రి వివేక్ వాహనంపై నిరసనకారులు రాళ్లతో దాడికి దిగారు. రాళ్ల దాడిలో మంత్రి వివేక్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాట, రాళ్ల దాడిలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేపట్టారు. ప్రస్తుతం క్యాతనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మంత్రిపై దాడిని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తుండగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
