* AI సమ్మిట్ కోసం ఢిల్లీకి ముఖ్యమంత్రి
ఆకేరు న్యూస్, డేస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ముంబై నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు. ఈ సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. నేడు రాత్రి 7:30 గంటలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ‘భారత్ మండపం’ వేదికగా ఈ విందు కార్యక్రమం జరగనుంది. ‘AI ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సదస్సును పురస్కరించుకుని ప్రధాని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది.రేపు ఉదయం జరగనున్న AI ఇంపాక్ట్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరుకానున్నారు. తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో, ఈ అంతర్జాతీయ సదస్సులో సీఎం పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, సాంకేతిక సహకారం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
