*నాసిరకం భోజనం పెడుతున్నారంటూ ఆందోళన!!
ఆకేరు న్యూస్, డేస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గత మూడు రోజులుగా హాస్టల్లో అందిస్తున్న ఆహారం ఏమాత్రం బాగోలేదని, దీనివల్ల తమ ఆరోగ్యం పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు. విద్యార్థినుల ఆందోళనకు స్థానిక గ్రామస్తులు, పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. రహదారిపై సుమారు అరగంటకు పైగా ధర్నా నిర్వహించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నిరసనలో పాల్గొన్న నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నాసిరకం భోజనం పెడుతున్న పాఠశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, తమకు మెరుగైన ఆహారం అందించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై కురుమూర్తి, తహసీల్దార్ కార్తీక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
