*బాలికకు గంజాయి తాగించి ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం.
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో మరోసారి మృగాళ్లు రెచ్చిపోయారు. రక్షణ కల్పించాల్సిన చోటే రాక్షసత్వానికి పాల్పడ్డారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై ముగ్గురు రౌడీషీటర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితులు ముగ్గురూ పక్కా ప్లాన్‌తో బాలికను ట్రాప్ చేశారు. ఆమెకు బలవంతంగా గంజాయిని తాగించి, స్పృహ కోల్పోయేలా చేశారు. బాలిక మత్తులో ఉన్న సమయంలో ముగ్గురు నిందితులు ఆమెపై అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టారు. వైద్యుల సమాచారం మేరకు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు ముగ్గురూ పాత నేరస్తులని (రౌడీషీటర్స్) గుర్తించారు. ప్రస్తుతం వారు పోలీసుల నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
