GHMCలో మొదలైన ‘ఫోటో’ హడావుడి.. ఇది మార్పుకా? ఎన్నికల స్టంటా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ యంత్రాంగం ఒక్కసారిగా పరుగులు తీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర పారిశుధ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, జిహెచ్ఎంసి (GHMC) అధికారులు నిద్రలేచారు. ఐఏఎస్ అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా రోడ్లపైనే కనిపిస్తున్నారు. అయితే, ఈ హఠాత్తు మార్పు వెనుక ఉన్న అసలు కారణం ప్రజల సౌకర్యమా లేక రాబోయే ఎన్నికల వ్యూహమా అన్న చర్చ నగరవాసుల్లో మొదలైంది. సీఎం సీరియస్ కావడంతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అధికారుల హడావుడి మామూలుగా లేదు. చెత్త తొలగింపు, డ్రైనేజీ క్లీనింగ్ పనుల వద్ద ఫోజులిస్తూ ఫొటోలు దిగడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గత రెండేళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న పారిశుధ్యం, ఇప్పుడు ఒక్కసారిగా చక్కదిద్దుతామంటే నమ్మశక్యంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండటంతోనే ఈ ‘క్లీన్ సిటీ’ నాటకం ఆడుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు.
చిక్కుల్లో నగరం పేరుకుపోయిన సమస్యలు:
ప్రధాన రహదారుల నుంచి గల్లీల వరకు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. సగానికి పైగా వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో ప్రయాణం నరకంగా మారింది. చారిత్రక కట్టడాల పరిసరాల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఇది పర్యాటకుల ముందు నగరం పరువు తీస్తోంది. కేవలం సీఎం ఆగ్రహానికి భయపడో, లేక ఎన్నికల కోసమో చేసే పనులు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. హైదరాబాద్కు కావాల్సింది ఫోటో షూట్లు కాదు, ఒక పటిష్టమైన వ్యవస్థ. పాతబడిన డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. చెత్త సేకరణలో అత్యాధునిక సాంకేతికతను జోడించాలి. అధికారులు కేవలం సమీక్షల సమయంలో కాకుండా, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి. ముఖ్యమంత్రి ఆశించిన ‘క్లీన్ సిటీ’ కల నెరవేరాలంటే అధికారుల్లో చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు మొదలైన ఈ ఉత్సాహం ఎన్నికల వరకు మాత్రమే కాకుండా, నిరంతరం కొనసాగినప్పుడే హైదరాబాద్ క్లీన్ సిటీ కల సాకారమవుతుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
