ఆడంబరాలు లేవు.. హంగులు లేవు.. కేవలం దండల మార్పిడితో ఒక్కటయ్యారు
ఆకేరు న్యూస్, డేస్క్: నేటి కాలంలో పెళ్లి అంటే కోట్ల రూపాయల ఖర్చు, భారీ సెట్టింగులు, బ్యాండ్ బాజాలు ఉండాల్సిందే. సామాన్యులే లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే, ఉన్నత స్థితిలో ఉన్నవారు ఇంకెంత ఆడంబరంగా చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు వీటన్నింటికీ భిన్నంగా, అత్యంత సరళంగా వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన మాధవ్ భరద్వాజ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అదితి వార్ష్ణేయ ఇద్దరూ 2023 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారులు. వీరిద్దరికీ సివిల్ సర్వీసెస్ శిక్షణ సమయంలోనే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. తమ మనసులోని మాటను పెద్దలకు చెప్పి, వారి అంగీకారం కోసం వేచి చూశారు. ఇటీవలే ఇరు కుటుంబాల వారు పచ్చజెండా ఊపడంతో ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఎలాంటి హడావుడి లేకుండా రాజస్థాన్‌లోని అల్వార్ మినీ సచివాలయంలో కలెక్టర్ సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎటువంటి మ్యూజిక్, అలంకరణలు లేకుండా కేవలం దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. చట్టబద్ధమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఎస్డిఎమ్ (SDM) గా విధులు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఎస్డిఎమ్ (SDM) గా బాధ్యతలు చేపడుతున్నారు. ఉన్నత హోదాలో ఉండి కూడా ఆడంబరాలకు పోకుండా, ఆదర్శవంతంగా పెళ్లి చేసుకున్న ఈ ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. యువతకు వీరు ఒక గొప్ప స్ఫూర్తి అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
