*రాజస్థాన్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల విక్రయం జరుగుతుందన్న పక్కా సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ బృందం (SOT) మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు రెండున్నర కిలోల ఓపియం (OPM) డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ మార్కెట్లో లక్షలాది రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.రాజస్థాన్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను నగరానికి తరలించి, ఇక్కడ విక్రయించేందుకు నిందితులు ప్లాన్ చేశారు. అయితే, ఎస్ఓటీ పోలీసులకు అందిన ముందస్తు సమాచారంతో నిందితుల వ్యూహం ఫలించలేదు. అరెస్ట్ చేసిన వారిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.
“ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరికి స్థానికంగా ఎవరైనా సహకరిస్తున్నారా? అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నాం” అని పోలీస్ అధికారులు వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
———————
