*త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో సందడి
ఆకేరు న్యూస్, హన్మకొండ: విద్యారణ్య ప్రభుత్వ సంగీత మరియు నృత్య కళాశాలలో గురువారం నిర్వహించిన సద్గురు త్యాగరాజ స్వామి 179వ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పండిట్ శ్రీవిష్ణు నారాయణ్, పండిట్ శ్రీవిష్ణు దిగంబర్ పలుస్కర్ జయంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తనలోని కళాకారిణిని పరిచయం చేస్తూ, వయోలిన్పై ‘బ్రహ్మమురారి’, ‘అయిగిరి నందిని’ వంటి భక్తి గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి ఆమె సంగీత కోలాహలంలో పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన పంచరత్న కీర్తనల గానం, కర్ణాటక గాత్ర కచేరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తనకు సంగీతం అంటే ఎంతో ఇష్టమని, కర్ణాటక వయోలిన్ విద్యను తిరిగి అభ్యసించడం ప్రారంభించానని తెలిపారు. వీలున్నప్పుడల్లా సంగీత కళాశాలను సందర్శిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. సుధీర్ కుమార్, అధ్యాపకులు సత్యనారాయణ, వాస గోపీనాథ్, విష్ణుకృష్ణ, పడక భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
