‘నేషనల్ ఏఐ కౌన్సిల్’ ఏర్పాటు చేయాలి – ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, డెస్క్: నేటి ఆధునిక యుగంలో సాంకేతిక విప్లవం మానవ జీవిత గమనాన్ని మార్చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తులో అన్ని రంగాలను శాసించబోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా AI వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు, ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో పన్నుల వ్యవస్థ కోసం పనిచేస్తున్న GST కౌన్సిల్ మాదిరిగానే, కృత్రిమ మేధస్సు కోసం ‘నేషనల్ ఏఐ కౌన్సిల్’ (National AI Council) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కౌన్సిల్ పనిచేస్తే సాంకేతిక రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలోనే కాకుండా, ప్రస్తుతం AI విభాగంలోనూ దూసుకుపోతోందని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలోని AI స్టార్టప్‌లు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయని, వీటికి తగిన ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. AI కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాకుండా, సామాన్యుడికి చేరువ కావాలని రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా పంటల దిగుబడి పెంచడంలో, వాతావరణ మార్పులను అంచనా వేయడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు లభిస్తాయి. విద్య, వైద్యం, రవాణా ఇలా ప్రతి విభాగంలోనూ ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వివరించారు. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
