*నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు…
*డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు!!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలను బాంబు బెదిరింపులు వణికిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు శుక్రవారం (ఫిబ్రవరి 20) మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం కోర్టు సిబ్బందికి ఒక అపరిచిత ఈమెయిల్ వచ్చింది. అందులో “కోర్టు ప్రాంగణంలో బాంబు అమర్చాం.. దానికి టైమర్ కూడా సెట్ చేశాం, అది ఏ క్షణమైనా పేలవచ్చు” అంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు మరియు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) మరియు అగ్నిమాపక సిబ్బంది నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులను, కక్షిదారులను మరియు సిబ్బందిని వెంటనే బయటకు పంపించి వేశారు. బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి కోర్టు మూలమూలలా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 18న హైదరాబాద్ (నాంపల్లి), కరీంనగర్, రాజమహేంద్రవరం మరియు అనంతపురం కోర్టులకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, మెయిల్స్ వచ్చాయి. అప్పట్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అవి ‘ఫేక్ కాల్స్’ గా నిర్ధారించారు. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మెయిల్స్ మరియు ఫోన్ కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? వీటి వెనుక ఉన్న అగంతకులు ఎవరు? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
