*పద్మాక్షి ఉమెన్స్ హాస్టల్ సమస్యలపై నిరసన!!
ఆకేరు న్యూస్, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ (KU) అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ పరిధిలోని పద్మాక్షి ఉమెన్స్ హాస్టల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ PDSU మరియు SFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు పాలనా భవనాన్ని ముట్టడించారు. విద్యార్థినులు తమ గోడును వెళ్లగక్కుతూ పలు కీలక అంశాలను లేవనెత్తారు. గత 15 రోజులుగా హాస్టల్లో కనీసం వాడుక నీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో సరైన వసతులు లేవని, దీనివల్ల రోజువారీ జీవనం నరకప్రాయంగా మారిందని విద్యార్థులు తెలిపారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా, కనీస స్పందన లేకపోవడంతోనే రోడ్డెక్కాల్సి వచ్చిందని వారు మండిపడ్డారు. పాలనా భవనం ముందు బైఠాయించిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని PDSU మరియు SFI నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, విద్యార్థినుల కనీస అవసరాలను తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
