* చార్జ్‌షీట్‌ను మరోసారి తిరస్కరించిన కోర్టు!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆర్టిసి క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనకు సంబంధించిన విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు మూడోసారి తిరస్కరించింది. సరైన ఆధారాలు సమర్పించలేదన్న కారణంతో పత్రాలను వెనక్కి పంపింది. ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఛార్జ్‌షీట్‌ను సిద్ధం చేశారు. అయితే, దీనిని పరిశీలించిన కోర్టు సాంకేతిక లోపాలను ఎత్తిచూపింది. ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించడానికి ప్రధానంగా డిజిటల్ ఆధారాల లేమిని కోర్టు ప్రస్తావించింది. ఘటనకు సంబంధించిన సీడీలు (CDs),పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లను ఛార్జ్‌షీట్‌తో పాటు జత చేయలేదు. సాంకేతిక ఆధారాలు లేకుండా విచారణ ముందుకు సాగదని స్పష్టం చేస్తూ, లోపాలను సరిదిద్ది మళ్ళీ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే రెండుసార్లు ఛార్జ్‌షీట్‌ను కోర్టు తిప్పి పంపగా, ఇప్పుడు మూడోసారి కూడా అదే జరగడం చర్చనీయాంశంగా మారింది. పదే పదే సాంకేతిక లోపాలు తలెత్తడంతో, ఈ కేసు విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు తదుపరి చర్యగా కోర్టు సూచించిన డిజిటల్ ఆధారాలను సేకరించి, మరోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
