* ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసిన ఇండియన్ ఎప్ స్టీన్ ఫైల్స్
* టార్చర్ కోసం స్పెషల్ చాంబర్
* దంపతులకు మరణ శిక్ష విదించిన న్యాయస్థానం
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్ : జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ ఒక వైపు ప్రపంచాన్ని నిర్ఘాంత పోయేటట్టు చేశాయి. పసిపిల్లల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని సమాజం ఆవేదనతో విలవిల్లాడిపోయింది .. ఇదే తరహా అమానుషం ఇండియన్ ఎప్ స్టీన్ ఫైల్స్ ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూశాయి. ఏకంగా 33 మంది మగ పిల్లలను అమానుషంగా రేప్ చేశారు. లైంగిక దాడి చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేశారు. మాట వినని పిల్లలను చిత్ర హింసలకు గురి చేశారు. తల్లి దండ్రులన చంపేస్తామని బెదిరించారు. వీరి అమానుషానికి బలైన వారిలో మూడేళ్ళ వయసు నుంచి 16 ఏళ్ళ పిల్లలు ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని బాందా ప్రాంతానికి చెందిన రామ్ భావన్ గౌరవప్రదమైన ప్రభుత్వ అధికారి.. అదీ ఒక ముసుగు మాత్రమే.. నిజ జీవితంలో మాత్రం పసి మొగ్గలను చిదిమేసే నర రూప రాక్షసుడు.. ఉత్తర ప్రదేశ్ నీటి పారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రామ్ భావన్ ( 50 ) అతని భార్య దుర్గావతి ( 47 ) చేసిన నేరాలు వింటుంటే, “మనిషి ఇంత క్రూరంగా మారగలడా .?” అనే ప్రశ్న తలెత్తుతుంది. 2010 నుంచి 2020 వరకు ఈ జంట సాగించిన పైశాచిక యాత్ర వెనుక ఉన్న షాకింగ్ వివరాలు ఇప్పుడు వెలుగు చూశాయి. రామ్ భావన్ భార్య దుర్గావతి తన భర్త చేస్తున్న అకృత్యాలకు సహకరించడమే కాకుండా, బాధితులను ప్రలోభపెట్టి నేరాలను కప్పిపుచ్చడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ దారుణాలు 2010 నుండి 2020 వరకు దాదాపు పదేళ్ల పాటు నిరంతరాయంగా సాగాయి. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు చాక్లెట్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు (మొబైల్స్) ఆశచూపి తమ ఇంటికి పిలిపించుకునేవారు. అక్కడ వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియో తీసి, వాటిని డార్క్ వెబ్ (Dark Web) లో విదేశీయులకు విక్రయించేవారు. 2020లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డార్క్ వెబ్ పై నిఘా ఉంచినప్పుడు, చిత్రకూట్ మరియు బాందా ప్రాంతాల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు అప్లోడ్ అవుతున్నట్లు గుర్తించింది. సీబీఐ పక్కా సమాచారంతో రామ్ భవన్ ఇంటిపై దాడి చేయగా, అక్కడ ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లలో వేల సంఖ్యలో అభ్యంతరకర వీడియోలు, ఫోటోలు లభించాయి.
*క్రూరత్వం లో భర్తకు తోడుగా..
పిల్లలకు ఆమెపై నమ్మకం కలిగేలా చేసి, వారిని ప్రలోభపెట్టి ఇంటికి తీసుకువచ్చేది.మొబైల్ ఫోన్లు, చాక్లెట్లు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, సైకిళ్ళు ఇస్తామని పిల్లలను తన వలలో వేసుకునేది.
పిల్లలకు ‘పిన్ని’గా దగ్గరై, తన భర్త గదిలోకి వారిని తోసేది. పిల్లలు భయపడి ఏడుస్తుంటే, “మర్యాదగా ఉంటే ఫోన్ ఇస్తాం, లేదంటే మీ అమ్మా నాన్నలను చంపేస్తాం… లేదంటే జైలుకు పంపిస్తాం” అని వారిని బ్లాక్ మెయిల్ చేసేది. సాక్ష్యాలను నాశనం చేయడంలో, పెన్ డ్రైవ్‌లను దాచడంలో దుర్గాదేవి సిద్ధహస్తురాలు. సీబీఐ అధికారులు రామ్ భవన్ ఇంటిపై దాడి చేసినప్పుడు, అక్కడ లభించిన ఆధారాలు చూసి నివ్వెరపోయారు. భర్త పక్క గదిలో పిల్లలపై దారుణాలకు ఒడిగడుతుంటే, ఆమె బయట ఎవరూ రాకుండా కాపలా కాసేది.వీడియోలు తీయడంలో కూడా అతనికి సహాయం చేసినట్లు సీబీఐ అధికారులు సాక్ష్యాలు సేకరించారు.
* మగ పిల్లలే ఎందుకంటే..?
రామ్ భావన్ తన నేరాలకు ‘మగపిల్లలను’ ఎంచుకోవడానికి ఒక వ్యూహం ఉంది. మగ పిల్లల రక్షణకు సంబందించి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోరు. అదే విదంగా ఆడపిల్లలపై అకృత్యాలు జరిగితే సమాజం త్వరగా స్పందిస్తుంది, అబ్బాయిల విషయంలో ఆ అవగాహన తక్కువ. పిల్లలు బయటకు చెప్పుకున్నా అది సామాజికంగా పెద్ద చర్చకు రాదని భావించారని తెలుస్తోంది. ఇంజనీర్ అయిన రామ్ భవన్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాల కోసం అద్భుతంగా వాడుకున్నాడు. అత్యంత దారుణమైన విషయం పిల్లలపై దాడులు చేస్తున్నప్పుడు వాటిని హై-క్వాలిటీ కెమెరాలతో రికార్డ్ చేసేవాడు.ఈ వీడియోలను ‘డార్క్ వెబ్’ ద్వారా అమెరికా, యూరప్ దేశాల్లోని చైల్డ్ పోర్న్ సైట్లకు విక్రయించేవాడు. ఒక్కో వీడియోకు వేల డాలర్లు వసూలు చేసినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. దీనికోసం అతను విదేశీయులతో ఎన్క్రిప్టెడ్ చాట్స్ చేసేవాడు. అంతే కాకుండా పిల్లలపై లైంగిక దాడి చేసే వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చేసేవాడని దర్యాప్తులో తేలింది.
* టార్చర్ కోసం ప్రత్యేక చాంబర్
పిల్లలపై లైంగిక దాడులు చేసేటప్పుడు ప్రతిఘటిస్తే తీవ్రంగా బెదిరించడమే కాకుండా గొలుసులతో కట్టి పడేసి చిత్ర హింసలకు గురి చేసేవారని తెలుస్తోంది. ఒక రహస్య గదిలో పిల్లలను కట్టిపడేయడానికి వాడే గొలుసులు, బెల్టులు దొరికాయి.12 పెన్ డ్రైవ్‌లు, 4 ల్యాప్‌టాప్‌లు, 8 మొబైల్ ఫోన్లలో 33 మంది బాధితులకు సంబంధించిన 3000 కు పైగా వీడియో క్లిప్పింగ్స్ దొరికాయి.
* భార్యా భర్తలకు ఉరిశిక్ష
కేసు విచారించిన ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు న్యాయమూర్తి పీకే మిశ్రా సంచలన తీర్పు ఇచ్చారు. రామ్ భావన్ , దుర్గావతి దంపతులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయ మూర్తి తీర్పునిచ్చారు. ఇది “అరుదైన వాటిలో అత్యంత అరుదైన (Rarest of Rare)” కేసుగా కోర్టు అభివర్ణించింది. బాధితులైన 33 మంది బాలురకు ఒక్కొక్కరికి ₹10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. “రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి, చిన్నారుల భవిష్యత్తును బుగ్గిపాలు చేసిన ఈ జంటకు సమాజంలో బతికే అర్హత లేదు” అని న్యాయస్థానం పేర్కొంది. న్యాయస్థానం తన తీర్పులో ఒక ముఖ్యమైన మాట చెప్పింది: “నేరం చేసిన వాడితో సమానంగా, ఆ నేరానికి సహకరించిన వారు కూడా నేరస్తులే.” అందుకే రామ్ భవన్‌తో పాటు, అతని భార్యకు కూడా అదే కఠినమైన మరణశిక్ష విధించింది. ఈ దంపతులు చేసిన నేరాలు కేవలం ఒక వ్యక్తులపై జరిగినవి కావు, మొత్తం మానవత్వంపై జరిగిన దాడిగా భావించాలన్నారు . బాధితుల్లో మూడేళ్ల బాలుడు ఉన్నాడంటే వీరిలో కనికరం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. వీరికి మరణశిక్ష విధించకపోతే చట్టంపై ప్రజలకు నమ్మకం పోతుంది” అని పేర్కొన్నారు.
———————————–
