* ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద బీజేపీ – కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ!
ఆకేరు న్యూస్, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. అరోరా భూముల వ్యవహారం కాస్తా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధానికి దారితీసింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో కామారెడ్డిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరోరా భూముల అంశంపై చర్చకు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి విసిరిన సవాల్‌తో ఈ రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమై క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే, అక్కడ అప్పటికే ఉన్న బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది కాస్తా ముదిరి పరస్పర దాడుల వరకు వెళ్లింది. ఈ గొడవలో ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. ఈ క్రమంలోనే ఒక కాంగ్రెస్ నేతకు చెందిన కారు అద్దాలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. లాఠీలకు పనిచెప్పి ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
