* మూసీ నది అభివృద్ధి పేరుతో ప్రజల స్థలచలనం ‘గాంధేయ సిద్ధాంతాలకు విరుద్ధం’: తుషార్ గాంధీ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ‘గాంధీ సరోవర్’ యోజనపై మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా ప్రజలు తమ నివాసాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.
మూసీ నది–ఈసీ నది సంగమం వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే అంశంపై నేరుగా వ్యాఖ్యానించని తుషార్ గాంధీ, అయితే ఆ ప్రాజెక్టు వల్ల జరిగే స్థలచలనం మాత్రం పూర్తిగా తప్పేనని అన్నారు. సోషల్ మీడియా లో స్పందించిన ఆయన, గాంధీ విగ్రహం కోసం ప్రజలను తరలించడం “అత్యంత అగాంధేయ చర్య” అని పేర్కొన్నారు. “బాపూజీ ఉన్నట్లయితే ‘నా పేరుతో ఇది చేయవద్దు’ అని స్పష్టంగా చెప్పేవారు” అంటూ ఆయన తన పోస్టులో వ్యాఖ్యానించారు.

ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ చర్యలపై ఇప్పటికే పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మూసీ నది బఫర్ జోన్ పరిధిలో ఉన్న బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ సముదాయం తొలగింపుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ అపార్ట్మెంట్ సముదాయం 2007లో అన్ని అనుమతులతో నిర్మించబడిందని, అప్పట్లో బఫర్ జోన్ పరిమితి 12 మీటర్లుగా ఉండేదని నివాసితులు చెబుతున్నారు. అనంతరం 2012లో బఫర్ జోన్‌ను 50 మీటర్లకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కె. వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గండిపేట మరియు రాజేంద్రనగర్ మండలాల్లో భూసేకరణకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. హిమాయత్‌సాగర్ బండ్ పరిధిలోని కిస్మత్పూర్, దర్గా ఖలీజ్ ఖాన్ గ్రామాల్లో సుమారు 33 ఎకరాలు, అలాగే బండ్లగూడ జాగీర్, ఉప్పర్‌పల్లి, హైదరగూడ ప్రాంతాల్లో మరో 42 ఎకరాలు భూసేకరణకు నోటిఫై చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ విస్తీర్ణం సుమారు ఆరు ఎకరాలు కాగా, అందులో 2.5 ఎకరాలు మూసీ నది బఫర్ జోన్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. అపార్ట్మెంట్ నివాసితులకు భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇళ్లను ఖాళీ చేయాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కూడా అధికారులు తెలిపారు. అదేవిధంగా గ్రామ సభలు నిర్వహించడం, ప్రతి నిర్మాణానికి సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే చేయడం, యాజమాన్య పత్రాల పరిశీలన అనంతరం పరిహారంపై చర్చించే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, గాంధీ పేరుతో చేపట్టే అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను ప్రభావితం చేయకుండా ఉండాలన్న తుషార్ గాంధీ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారాయి.
