Chahat Bajpai Hanumakonda Inspection
* అధికారులకు కీలక ఆదేశాలు
ఆకేరు న్యూస్, హనుమకొండ, జూలై 17: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. అలాగే, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాలోని పోచమ్మకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు రెవెన్యూ కాలనీ, పోచమ్మకుంట అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
* ఆరోగ్య కేంద్రంలో రికార్డుల పరిశీలన..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) తనిఖీలో భాగంగా రోజువారీగా వచ్చే రోగుల సంఖ్య, అందిస్తున్న వైద్య సేవలు, రోగుల నమోదు ప్రక్రియ, ప్రాథమిక పరీక్షలు, కంప్యూటరైజ్డ్ రికార్డులను వైద్యాధికారి డాక్టర్ ఎన్. దీప్తిని అడిగి తెలుసుకున్నారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.
అనంతరం క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తుల వివరాలు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందుల పంపిణీ, నెలవారీ పర్యవేక్షణ, వాటి డిజిటల్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. టీబీ రోగులకు నిరంతర వైద్య సేవలు అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలను పరిశీలించి, అవసరమైన అన్ని ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని టీబీ బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన కలెక్టర్, వారి ఆరోగ్య పరిస్థితిని మరియు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.


* అంగన్వాడీ కేంద్రాల తనిఖీ..
అనంతరం రెవెన్యూ కాలనీ, పోచమ్మకుంట అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పోషకాహారం అందించాలని స్పష్టం చేశారు. కేంద్రాల్లో పరిశుభ్రత, హాజరు, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ మదన్ మోహన్ రావు, వైద్యాధికారులు, ఐసీడీఎస్ (ICDS) సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

