ఫిన్ అలెన్ రికార్డుల సునామీ…
టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో నయా చరిత్ర!!
ఆకేరు న్యూస్, డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకున్న వేళ, క్రికెట్ ప్రపంచం ఎన్నడూ చూడని ఒక అద్భుత ఇన్నింగ్స్‌కు ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే శతకాన్ని అందుకుని, టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
విధ్వంసకర గణాంకాలు:
ఈ మ్యాచ్‌లో అలెన్ ఆడిన తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదాడు. అంటే బౌండరీల రూపంలోనే ఏకంగా 88 పరుగులు రాబట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను ఎదుర్కొన్న 33 బంతుల్లో కేవలం 4 బంతులు మాత్రమే డాట్ బాల్స్ కావడం. ఒక పవర్ హిట్టర్ అయి ఉండి కూడా, డాట్ బాల్స్ లేకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించడం అలెన్ పరిణతికి నిదర్శనం.
కోహ్లీ రికార్డుకు తృటిలో..
గణాంకాల ప్రకారం, టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో (సెమీఫైనల్/ఫైనల్) కనీసం 30 బంతులు ఆడిన వారిలో అత్యంత తక్కువ డాట్ బాల్స్ ఆడిన రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2014 సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై కోహ్లీ 44 బంతుల్లో 72 పరుగులు చేసినప్పుడు కేవలం 3 డాట్ బాల్స్ మాత్రమే ఆడాడు. అలెన్ ఈ మ్యాచ్‌లో 4 డాట్ బాల్స్ ఆడటంతో, కేవలం ఒక్క బంతి తేడాతో కోహ్లీ ఆల్-టైమ్ రికార్డును సమం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ, అత్యంత తక్కువ డాట్ బాల్స్ ఆడిన రెండో ఆటగాడిగా అలెన్ నిలిచాడు.
ఫైనల్‌కు కివీస్ దర్జాగా..
సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (58*) కూడా సహకరించడంతో కివీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఫిన్ అలెన్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాడు.
