* విపక్షాలకు భట్టి సూటి ప్రశ్న
* అవసరమైతే సలహాలివ్వండి.. అంతేగాని ప్రచార ఆర్భాటాలు వద్దు: భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ శాసనసభలో నేడు మూసీ ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా నరకం అనుభవిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలను మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతతోనే ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తోందని, ఇందులో ఎలాంటి రాజకీయ స్వార్థం లేదని భట్టి పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం ఘాటు ప్రశ్నలు సంధించారు. మూసీ తీరంలోని ప్రజలు ఎప్పటికీ మురికి కూపంలోనే బతకాలని మీరు కోరుకుంటున్నారా అని ఆయన నిలదీశారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడం వల్ల పేదవారు పేదలుగానే ఉండిపోవాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి జరిగితే పేదల జీవితాలు మెరుగుపడతాయని, అది ఇష్టం లేకనే ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. కేవలం విమర్శల కోసమే కాకుండా, ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా నిర్మాణాత్మక సలహాలు లేదా సూచనలు ఉంటే ఇవ్వాలని, వాటిని స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ప్రజల క్షేమం కోసం పని చేసే ప్రభుత్వమని, కేవలం ప్రచార ఆర్భాటాల కోసం మాటలు చెప్పే అలవాటు తమకు లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ మరియు ప్రక్షాళన ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు మార్చడమే కాకుండా, అక్కడి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆపబోమని ఆయన తన ప్రసంగంలో తేల్చి చెప్పారు.
