Shaadi.com matrimonial Scam in hyderabad
* షాదీ డాట్ కామ్‌లో యువతి పరిచయం
* తీయని మాటలతో దగ్గర
* నకిలీ వెబ్సైట్ ద్వారా పెట్టుబడులు పెట్టించి..
* అప్పు చేసి మరీ పెట్టుబడులు
* సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు రూ.10.35 లక్షలకు టోకరా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ఓ రోజు రాత్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు షాదీ డాట్ కామ్ ద్వారా యువతి పరిచయమైంది. ఇద్దరూ చాట్ చేసుకున్నారు. ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయని మురిసిపోయారు. హాయ్.. వివాహం చేసుకుందామా.. అని ఆ యువతి ప్రపోజల్ పెట్టింది. మాటల సందర్భంలో క్రిప్టో ట్రేడింగ్ గురించి వివరించింది. అందులో భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. మన భవిష్యత్‌కు ఉపయోగపడతాయని పేర్కొంది. నిజమే అని నమ్మిన ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.10 లక్షలు లోన్ తీసుకుని మరీ ఓ వెబ్సైట్ ద్వారా పెట్టుబడులు పెట్టాడు. ఆ డబ్బంతా ఆవిరి అయ్యేపోయే వరకూ అతడికి తెలియలేదు ఆ యువతి మోసగత్తె అని.
* పోలీసుల కథనం ప్రకారం..
షాదీ డాట్ కామ్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ నివాసం ఉంటున్నాడు. మాదాపూర్‌లోని ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఈ నెల 8న రాత్రి షాదీ డాట్ కామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆమె పేరు వైష్ణవి కాకరపర్తి అని పేర్కొంది. తొలుత సాధారణంగా మాట్లాడిన ఆమె తర్వాత ఆకట్టుకునేలా మాటలు కలిపింది. అనంతరం క్రిప్టో ట్రేడింగ్ ద్వారా తాను లాభాలు ఆర్జిస్తున్నట్లు చెప్పినట్లు తెలిపారు.
* నకిలీదని అనుమానం వచ్చినా..
షాదీ డాట్ కామ్ ద్వారా పరిచయమైన వైష్ణవి సూచనతో బాధితుడు వెలోరాక్స్సీహెచ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఖాతా తెరిచాడు. అది నకిలీ వెబ్సైట్ కావచ్చని తాను అనుమానం వ్యక్తం చేసినప్పటికీ.. తాను ఇప్పటికే అందులో పెట్టుబడులు పెడుతున్నానని నమ్మించింది. అది నమ్మకమైనదేనని చెప్పింది. మొదట తన పొదుపు నుంచి రూ.50 వేలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఆమె సూచించిన ట్రేడింగ్ సిగ్నల్స్ ఆధారంగా రెండు ట్రేడ్లు చేయగా రూ.20 వేల లాభం చూపించారని పేర్కొన్నారు. దీంతో మరింత పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని యువతి ప్రోత్సహించింది.
* బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుని..
మరిన్ని లాభాల కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని ఆమె ఒత్తిడి చేయడంతో బాధితుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. ఆ మొత్తాన్ని ఆరు విడతల్లో వెబ్‌సైట్‌కు సంబంధించిన ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. తర్వాత ట్రేడింగ్‌లో మరో రూ.3 లక్షల లాభం వచ్చినట్లు వెబ్సైట్లో చూపించారని తెలిపారు. అయితే మరింత లాభాల కోసం మరో ట్రేడింగ్ సిగ్నల్ ఉందని, అందుకు కనీసం రూ.3 లక్షలు అవసరమని యువతి చెప్పినట్లు పేర్కొన్నారు.
* ఉపసంహరించుకోవాలంటే..
వెబ్సైట్లో తనకు చూపిస్తున్న మొత్తంలో కొంత డబ్బును ఉపసంహరించుకునేందుకు బాధితుడు ప్రయత్నించాడు. తొలుత రూ. 2 వేల చొప్పున రెండు లావాదేవీలు విజయవంతమైనట్లు తెలిపారు. దీంతో వెబ్‌సైట్‌పై పూర్తిగా అనుమానం రాకుండా మరోసారి రూ.4 లక్షలు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా అది తిరస్కరించబడింది. వెబ్సైట్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించగా తన వాలెట్ ఫ్రీజ్ అయిందని, డబ్బు ఉపసంహరించుకోవాలంటే 1.971 యూఎస్ డాలర్లు అంటే సుమారు రూ.2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
* మొత్తం రూ. 10.35 లక్షలు
వాళ్లు అడిగిన డబ్బును వాలెట్లో ఉన్న డబ్బు నుంచి మినహాయించుకోవాలని కోరినా అంగీకరించలేదని, బయట నుంచి డబ్బు చెల్లించాల్సిందేనని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటివరకు నెట్ బ్యాంకింగ్, యూపీఐ మార్గాల్లో మొత్తం రూ. 10.35 లక్షలు బదిలీ చేసినట్లు బాధితుడు తెలిపారు. వెబ్సైట్లో రూ.3 లక్షల లాభం వచ్చినట్లు చూపించి.. దాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు మరో రూ.3 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇది సైబర్ మోసమని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
