* మానసిక క్షోభ భరించలేక బయటకు వెళ్తున్నా..
* తనను అణగదొక్కడానికి కుట్ర చేశారు
* ఫిరాయింపు ఎమ్మేల్యేను ప్రొత్సహించారు
* అధిష్టానం ఏనాడూ పట్టించుకోలేదు..
ఆకేరు న్యూస్, కరీంనగర్ : మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బుధవారం పార్టీ నుంచి వీడుతున్నట్లు ప్రకటించారు. జీవన్‌రెడ్డిని బుజ్జగించడానికి పలు దఫాలుగా మంత్రులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అనుచరులతో సమావేశం అనంతరం రాజీనామాకు సంబంధించిన లేఖను జీవన్‌రెడ్డి విడుదల చేశారు.
మా ప్రభుత్వం అని చెప్పుకోలేని పరిస్థితి..
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో నడుస్తోందని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే సంతోషం లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మా శ్రమ, కష్టార్జితానికి నిదర్శనమం.. ఇప్పుడు ఇది మా ప్రభుత్వం అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని తీసుకువచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పారు. కొంతమంది తనను అణగదొక్కాలని చూస్తున్నారని, జగిత్యాలలో తన ఉనికి లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారని వాపోయారు. తన రాజకీయ జీవితం ఎదుగుదలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి పరిస్థితిలో వీడడం బాధాకరమన్నారు. రాహుల్‌గాంధీ ఆశించిన విధానాలు తెలంగాణలో అమలు కావడంలేదు.. తాత్కాలిక ఉపశమనం కోసం వెంపర్లాడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదు.. రాహుల్ గాంధీ ఎత్తుకున్న *జై భీమ్, జై సంవిధాన్, జై బాపు* నినాదాలకు తూట్లు పొడిచారు.. ఆయనను కూడా ఇబ్బందుల్లోకి నేట్టేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధిష్టానానికి చెప్పినా స్పందనలేదు..
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగిత్యాల శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను 2024లోనే పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర అధ్యక్షుడికి వివరించినా ఎలాంటి స్పందన లేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో శాసన సభలో, శాసన మండలిలో ఏకపక్షంగా పోరాటం చేసినా పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వపరంగా నామినేటెడ్ పోస్టులన్నింటిలోనూ ఫిరాయింపు ఎమ్మెల్యే సలహా, సూచనల మేరకే నియామకాలు చేశారని అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనూ 50 స్థానాలకు 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేని వారిని నిర్ణయించారని తెలిపారు.
విధిలేని పరిస్థితుల్లో..
విధిలేని పరిస్థితులలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా నిలిచి పోరాటం చేశామని, అలాగే గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ కృషిని గుర్తించకుండా ఫిరాయింపు ఎమ్మెల్యే సూచనకు అనుగుణంగా మున్నిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని ఎంపిక చేశారని అన్నారు. గడిచిన 20 నెలల నుండి నియోజకవర్గ స్థాయిలో ఏకపక్షంగా ఫిరాయింపు ఎమ్మెల్యేను ప్రోత్సాహిస్తుండడంతో పార్టీలో దశాబ్దాల తరబడి జెండా వీడకుండా ఉన్న కార్యకర్తలు నిరాశ, నిస్పృహలకు లోనయ్యారని వివరించారు. ఈ క్రమంలో అనుభవిస్తున్న మానసిక క్షోభను అధిగమించలేక చివరికి పార్టీని వీడే పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు.
—————–
