* ప్రేమకు అడ్డు పడిందని ఘాతుకం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రేమకు అడ్డు పడిందని తల్లినే కడతేర్చింది ఓ కూతురు. ప్రియుడితో కలిసి కన్నతల్లి అని చూడకుండా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన దారుణ హత్య ఉదంతం హైదరాబాద్ జవహర్‌నగర్ పరిధిలో కలకలం రేపింది. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న కోపంతో తల్లిని కర్కషంగా అంతమొందించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కౌకూర్ భరత్ నగర్‌కు చెందిన అంజు (40) అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ఇషిక కొంతకాలంగా మాంటేరాజ్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. వీరిద్దరూ సహజీవనం చేయాలని భావించారు. అయితే, ఇషిక తల్లి అంజు వీరి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో తల్లి, కుమార్తెల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. తన ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని భావించిన ఇషిక, ఆమెను వదిలించుకోవాలని తన ప్రియుడితో కలిసి పథకం రచించింది.
అనుమానం రాకుండా..
పక్కా పథకం ప్రకారం, 10 నెలల క్రితం ఇషిక తన ప్రియుడు మాంటేరాజ్తో కలిసి తల్లి అంజును కిరాతకంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లకుండా తమ ఇంట్లోనే పూడ్చిపెట్టారు. ఆ తర్వాత అంజు అదృశ్యమైందని నమ్మబలికారు.
మిస్టరీ వీడిందిలా..
తల్లి కనిపించడం లేదంటూ అంజు పెద్ద కుమార్తె జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2025 మే నెలలో మిస్సింగ్ కేసు నమోదైంది. దాదాపు 10 నెలల పాటు పోలీసులు విచారణ చేనపట్టినా ఆధారాలు లభించలేదు. అయితే, ఇటీవల కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషించిన పోలీసులకు చిన్న కుమార్తె ఇషిక ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు అంగీకరించింది.
నిందితుల అరెస్ట్..
నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇంట్లో తవ్వకాలు చేపట్టి అంజు మృతదేహాన్నివెలికితీశారు. నిందితులు ఇషిక, మాంటేరాజ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
