*న్యాయవాదుల రక్షణ చట్టం
*కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రాత్మక విజయం – శామంతుల శ్రీనివాస్
*వరంగల్ కోర్టులో కాంగ్రెస్ లీగల్ సెల్ భారీ సంబరాలు
*న్యాయవాదుల రక్షణే రేవంత్ సర్కార్ ధ్యేయం
ఆకేరు న్యూస్, వరంగల్: భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ‘న్యాయవాద రక్షణ చట్టం’ (Advocates Protection Act) బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడం శుభపరిణామమని, ఈ ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్ కొనియాడారు. మంగళవారం వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు.
*గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన శ్రీనివాస్:
ఈ సందర్భంగా శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వామనరావు దంపతుల హత్య, వరంగల్ న్యాయవాది మల్లారెడ్డి హత్యలు జరగడం అత్యంత బాధాకరమని గుర్తు చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఎన్నో ఏళ్లుగా న్యాయవాద సంఘాలు డిమాండ్ చేస్తున్నా, గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.
*రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టి, ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. ఈ చట్టం రాకతో న్యాయవాదులు నిర్భయంగా తమ విధులను నిర్వహించుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు.
పాల్గొన్న ముఖ్య నేతలు..
ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ముదస్సిర్ అహ్మద్ కయ్యుమి, పరమేశ్వర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
