* కీలక శాఖలు బీజేపీ వద్దే
* టీడీపీకి ఉక్కు, విమానయాన శాఖలు?
* జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కీలక భేటీ
ఆకేరు న్యూస్ డెస్క్ : బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం 6 గంటలకు మూడో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేపీ నడ్డా నివాసంలో సమావేశమైన పార్టీ కీలక నేతలు, ఎంపీలు ఈమేరకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్చుపై చర్చించారు. ఏయే పదవులు తమ వద్ద ఉంచుకోవాలి.. మిత్రపక్షాలకు ఏం ఇవ్వాలి.. అనే దానిపై సమావేశంలో చర్చించారు. కీలక పదవులు తమ వద్దే ఉంచుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలిసింది. హోంశాఖ, రక్షణ, ఆర్థిక, మౌలిక, వ్యవసాయ, విదేశాంగ వంటి శాఖలను బీజేపీ ఎంపీలకే కేటాయించనున్నారు. ఎంపీ సంఖ్యలో కూటమిలో రెండో స్థానంలో ఉన్న టీడీపీకి విమానయాన శాఖ, ఉక్కు శాఖలతో పాటు.. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని నిర్ణయించినట్లు సమాచారం. జేడీయూకు గ్రమీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఇవ్వనున్నారు. తమకు ఈ పదవులు కావాలని మిత్రపక్షాల నుంచి పెద్దగా డిమాండ్లు రాలేదని తెలుస్తోంది. కీ రోల్ లో ఉన్న చంద్రబాబు కూడా ఎటువంటి డిమాండ్లనూ బీజేపీ నాయకత్వం వద్ద పెట్టలేదని సమాచారం. బీజేపీ అగ్రనాయకత్వానికే నిర్ణయం వదిలేసినట్లు తెలిసింది.
——————————-