Bandi Sanjay dumping yard protest Huzurabad
*డంపింగ్ యార్డు రద్దు కోసం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లతో పాటు గవర్నర్‌ను కలుస్తాం
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని,డంపింగ్ యార్డు రద్దు కోసం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లతో పాటు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.శుక్రవారం రాత్రి హుజూరాబాద్‌లోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద నిర్వహించిన బిజెపి ప్రజా ఆందోళనలో ఆయన పాల్గొని మాట్లాడారు… హుజురాబాద్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. నెల రోజులుగా అఖిలపక్ష పార్టీలు, ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వల్ల వెలువడే కాలుష్యం ఈ ప్రాంత యువత భవిష్యత్తును, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం నేషనల్ హైవే లను అభివృద్ధి చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ హైవేల పక్కన చెత్త డంపింగ్ యార్డ్ లను ఏర్పాటు చేస్తుందని ఎద్దేవా చేశారు. గుమ్లాపూరు లో ఎన్నికల మీటింగ్ కు ముఖ్యమంత్రి హాజరై హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నానని అన్నప్పుడు మొదటిసారిగా తానే ఖండించానని ఆయన గుర్తు చేశారు. అన్ని పార్టీలు కలిసి ఉద్యమం చేద్దామని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
హుజురాబాద్ ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ రక్షణ కవచంగా బిజెపి ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు డంపింగ్ యార్డ్ ఉపసంహరణకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని లేని పక్షంలో, కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటామని, వారి ఇంటి ముందు చనిపోయిన జంతువులను పడవేసి ప్రజల బాధ తెలిసేలా, ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని,సీఎం రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డ్ పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన మరింత ఉధృతం చేస్తామని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
