ACB Catches Irrigation Engineer
ఆకేరు న్యూస్, హన్మకొండ:
అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో అవినీతి తిమింగలాన్ని వలపన్ని పట్టుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను క్లియర్ చేసేందుకు ఒక కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ పాలకుర్తి ఇరిగేషన్ డీఈ (Divisional Executive Engineer) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు హన్మకొండలోని ఆయన నివాసంలో ఈ దాడులు నిర్వహించారు.
* సెప్టెంబర్ 2022 నుండి పెండింగ్ బిల్లులు..
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (I&CAD) విభాగంలో గంటి శ్రీకాంత్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DE)గా విధులు నిర్వహిస్తున్నారు. బాధితుడైన ఒక కాంట్రాక్టర్ గతంలో 10 డబుల్ బెడ్రూమ్ (2BHK) ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే, వీటికి సంబంధించిన ఫైనల్ మెజర్మెంట్లను ఎమ్-బుక్ (M-Books) లో నమోదు చేసి, బిల్లులను ప్రాసెస్ చేయడానికి డీఈ శ్రీకాంత్ సెప్టెంబర్ 2022 నుండి ఫైళ్లను పెండింగ్‌లో పెట్టారు.
* రూ. 50 వేలు లంచం డిమాండ్..
సదరు కాంట్రాక్టర్ తన బిల్లుల కోసం డీఈ చుట్టూ తిరగగా, పని పూర్తి చేయడానికి శ్రీకాంత్ రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు.
* ఇంట్లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా..
సోమవారం (25.05.2026) హన్మకొండలోని భవానీ నగర్లో గల డీఈ శ్రీకాంత్ నివాసంలో కాంట్రాక్టర్ నుండి రూ. 50,000 లంచం డబ్బును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి ఆయనను పట్టుకున్నారు. శ్రీకాంత్ వద్ద నుండి కెమికల్ పరీక్షల ద్వారా లంచం సొమ్మును రికవరీ చేశారు. అనంతరం ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు.
* అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు..
అధికారిక బాధ్యతలను దుర్వినియోగం చేస్తూ, అవినీతికి పాల్పడిన నిందితుడు గంటి శ్రీకాంత్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను వరంగల్‌లోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం (Hon’ble Special Judge for SPE & ACB cases) ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.
* ఏసీబీ అధికారుల విజ్ఞప్తి:
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్- 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
