Kadiyam Srihari Development Works
* చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
నియోజకవర్గ ప్రజలకు మెరుగైన విద్యా, వైద్యం, పరిపాలన అందించడమే నా ఏకైక లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో రూ. 45.50 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులను రూ. 26 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పురోగతిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అధికారులు, కాంట్రాకర్లను అడిగి తెలుసుకున్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబందించిన డిజైన్ పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయ్యే నాటికి వైద్య పరికరాలు, మెడికల్, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని అధికారులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే దసరా నాటికి నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అదేవిధంగా ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నమూనా పోస్టర్ ను పరిశీలించారు. నిర్మాణ పనులలో వేగం పెంచాలని కాంట్రాక్టర్ కు, అధికారులకకు సూచించారు. డిసెంబర్ 31 లోగ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం, పరిపాలన, విద్యా అందించేందుకు 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ ఆఫీస్ కాంప్లెక్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాల మంజూరు తీసుకురావడం జరిగిందని తెలిపారు. 45.50 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయని వచ్చే దసరా నాటికి నిర్మాణ పనులు పూర్తి కావాలని అన్నారు. ఆసుపత్రి ప్రారంభం నాటికి ఆసుపత్రిలో వైద్య పరికరాలు, మెడికల్, పారా మెడికల్ సిబ్బంది నియామకం జరగాలని సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంలో కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయాల సముదాయం నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. జీ+3 అంతస్తులతో భవన నిర్మాణం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 31 నాటికి నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో రూ. 6.10కోట్లతో డిగ్రీ కళాశాల మంజూరు అయిందని స్థల గుర్తింపులో కొంత ఆలస్యం అయిందని జూన్ నాటికి స్థల గుర్తింపు చేసి డిగ్రీ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. జఫర్ గడ్ మండలం కొనాయిచలం వద్ద 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఏడాది లోగ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31లోగ 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం, జూన్ 2027లోగ యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్, డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తానని స్పష్టం చేశారు.
“నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలోనే డిగ్రీ కళాశాలలో 35 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పామునూర్ వద్ద గల బంజరు మాటుకు కోటి రూ.92 లక్షలు మంజూరు అయ్యాయని త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేవాదుల ప్యాకేజీ-6 పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించారు. దేవాదుల ద్వారా నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 80 శాతం విజయం సాధించామని మిగిలిన 20 శాతం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
“కళ్ళు మూసుకుపోయి విమర్శలు
కొంతమందికి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కనిపించడం లేదని కళ్ళు మూసుకుపోయి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక రాజకీయ పబ్బం గడుపుకునేందుకే మాట్లాడుతున్నారని విమర్శించారు.
* చివరి గింజ ప్రభుత్వం కొంటుంది
ధాన్యం కొనుగోలులో రైతులకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నది వాస్తవమే అన్నారు. గన్ని సంచుల కొరత, హమాలీల కొరత, మిల్లులలో స్థలం లేకపోవడం, రవాణా వాహనాల కొరత వల్ల సమస్యలు ఏర్పడ్డయని అన్నారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. ప్రస్తుతం అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి మిల్లులకు తరలిస్తామని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అకాల వర్షాలు వస్తున్నందున కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సరిపడా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
* బీజేపీ నాయకుల తమాషాలు
తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు రావడం లేదని అన్నారు. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామాలు, తమాషాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఎం చేస్తున్నారని, రైతుల ధాన్యం కొనుగోలులో బీజేపీ నాయకులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తీవ్రమైన వడగాలులతో రైతులు చనిపోతే వారిని ఆదుకునేందుకు కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదని అన్నారు. బీజేపీ నాయకులు డ్రామాలు పక్కన పెట్టి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించాలని సవాల్ విసిరారు. బీజేపీ ప్రభుత్వానికి కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తుంది కానీ రైతులను ఆదుకునేందుకు మాత్రం ముందుకు రాదని విమర్శించారు. బీజేపీ, బిఆర్ఎస్, కాంగ్రెస్ అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి రైతులకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజమ్మ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బలిదే వెంకన్న, లింగాజీ, బుర్ల శంకర్, కొలిపాక సతీష్, కౌన్సిలర్లు లక్ష్మి, రజిత, కృష్ణవేణి, స్వరూప, మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
