DGP CV Anand MAOIST NARAHARI SURRENDER Maoist Weapons Stockpiles Forests
* లొంగిపోయిన నేతలపై ఖాకీల నిరంతర నిఘా
*గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వ్యవస్థల రద్దు ప్రసక్తే లేదు
– డీజీపీ సీవీ ఆనంద్
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి:
లొంగిపోయిన మావోయిస్టు ( Maoists ) లను పోలీసులు పూర్తిగా విశ్వసించడం లేదా..? ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే వారు మళ్లీ ఆయుధాలు పట్టుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ, రక్షణ రంగానికి చెందిన విశ్లేషకులు. లొంగిపోయిన మావోయిస్టు నేతల కదలికలపై అంతర్గతంగా నిరంతర నిఘా కొనసాగుతుండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దేశంలో మావోయిస్టు ఉద్యమం పూర్తిగా చల్లారిపోయిందని భావించడం లేదని, ఏ క్షణంలోనైనా ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని పోలీస్ బాస్ ల మాటలను బట్టి స్పష్టమవుతోంది.
ఇటీవల సీపీఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగిపోయిన సందర్భంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand ) చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
* అడవుల్లో ఇంకా ‘ఆయుధాల డంప్ లు’.. వేట ముమ్మరం
లొంగిపోయే సమయంలో మావోయిస్టు నేతలు అప్పగిస్తున్న తుపాకులు, ఆయుధాల కంటే.. ఇంకా భారీ మొత్తంలో అత్యాధునిక ఆయుధ నిల్వల డంప్‌లు అడవుల్లోనే భద్రపరిచారని పోలీస్ శాఖ గట్టిగా నమ్ముతోంది. లొంగిపోయిన నేతలు ఆయుధాల సమాచారాన్ని పూర్తిగా వెల్లడించడం లేదనే భావన డీజీపీ మాటల్లో వ్యక్తమైంది.ఇప్పటికే లొంగిపోయిన వారి నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా కొన్ని ఆయుధ డంప్ లను వెలికితీశాం. కానీ, ఇంకా ఆచూకీ లభించని మరిన్ని కీలక డంప్ ల కోసం అడవుల్లో వేట కొనసాగుతూనే ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.
మరోవైపు, లొంగిపోయిన మావోయిస్టులు మళ్లీ పాతబాట పట్టకుండా ఉండేందుకు వారిపై నిరంతర నిఘా ఉంచుతూనే.. వారికి సమాజంలో పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారి జీవనభృతి కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అందించనున్నారు. ఇందులో భాగంగానే డీజీపీ స్వయంగా త్వరలోనే జిల్లాల్లో పర్యటించి, లొంగిపోయిన మావోయిస్టులతో ముఖాముఖి చర్చించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమం తొలుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచరం .
* గ్రేహౌండ్స్, ఎస్ఐబీలను ఎత్తివేసే ప్రసక్తే లేదు
దేశాన్ని ‘మావోయిస్ట్ ముక్త్ భారత్’ ( Maoist Mukth Bharath ) గా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నప్పటికీ.. భద్రతా బలగాలు ఎక్కడా అలసత్వాన్ని ప్రదర్శించడం లేదు. మావోయిస్టుల ఏరివేతలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కీలకమైన గ్రేహౌండ్స్ (Greyhounds) స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) వ్యవస్థలను ఎత్తివేసే ప్రసక్తే లేదని పోలీస్ బాస్ తేల్చి చెప్పారు.
గత అనుభవాల దృష్ట్యా మావోయిస్టు పార్టీ నెట్వర్క్ అంత సులభంగా నశించిపోదని, అంతర్గతంగా అది మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందనే అంచనాలు ఉన్నాయి. భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ ఏ రూపంలో సవాల్ విసిరినా, వ్యూహాత్మకంగా తిప్పికొట్టేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీల్లో పనిచేసే సిబ్బంది సంఖ్యను కొంతమేర తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ సంస్థలను పూర్తిగా రద్దు చేసే ప్రసక్తే లేదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
* గణపతి భారతదేశంలోనే ఉన్నాడు..
సీపీఐ మావోయిస్ట్ పార్టీ ( CPI Maoist Party ) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ( Mupplla Laxman Rao ) ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆయన నేపాల్‌లో తలదాచుకున్నారని కొందరు, థాయిలాండ్ లేదా బ్యాంకాక్ వంటి విదేశాలకు వెళ్లిపోయారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ విదేశీ ప్రచారంలో నిజం లేదని డీజీపీ సీవీ ఆనంద్ కొట్టిపారేశారు. గణపతి ఆచూకీపై లొంగిపోయిన ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యులకు కూడా స్పష్టమైన సమాచారం లేదు.నిఘా వర్గాల నమ్మకం ప్రకారం గణపతి విదేశాలకు వెళ్ళలేదు.. భారతదేశంలోనే ఎక్కడో ఒక రహస్య స్థావరం లో తలదాచుకున్నారు.ఈ నేపథ్యంలోనే, గణపతితో పాటు ఆయన భార్య రత్నాబాయి, మరో కీలక నేత వార్తా శేఖర్ లు కూడా తక్షణమే లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. వృద్ధాప్యం, వారు లొంగిపోతే ఎలాంటి అపాయం లేకుండా, పూర్తి వైద్య సదుపాయాలు మరియు పునరావాసం కల్పిస్తామని ఖాకీ బాస్ సీవీ ఆనంద్ భరోసా ఇచ్చారు. డీజీపీ పిలుపు ఏ మేరకు ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే..
——————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.

విప్లవ ఆలోచనలు, అభ్యుదయ భావాలు అనేవి శ్వాస, ఆక్సీజన్ లాంటివి…
ప్రపంచంలో జీవ జాతులు ఉన్నంత కాలం అవి ఉంటాయి..