Chiranjeevi Tollywood theatres revenue Crisis Solution
* సద్దుమణిగిన ‘రెంటల్’ సంక్షోభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి సంక్షోభం తలెత్తినా ‘నేనున్నానంటూ’ ముందుండే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్దరికాన్ని, అద్భుత నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీని కుదిపేస్తున్న ‘రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్’ (Rental Vs Percentage) వివాదానికి చిరంజీవి జోక్యంతో ఎట్టకేలకు తెరపడింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనను ఆయన సానుకూల వాతావరణంలో పరిష్కరించారు.
* చిరు నివాసంలో మీటింగ్..
పరిస్థితి తీవ్రతను గమనించిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. వివాదానికి కారణమైన మూడు రంగాల (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) ముఖ్య ప్రతినిధులను తన నివాసానికి ఆహ్వానించి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గంటల తరబడి సాగిన ఈ సుదీర్ఘ చర్చల్లో ఇరు వర్గాల వాదనలను చిరంజీవి ఓపిగ్గా విన్నారు. ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలని, విభేదాలు వీడి ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
* తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం – జూన్ 30 వరకు ఊరట…
మెగాస్టార్ ఇచ్చిన గట్టి హామీతో తెలంగాణ థియేటర్ల ఎగ్జిబిటర్లు తమ పట్టును వీడారు. వచ్చే జూన్ 30వ తేదీ వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ‘రెంటల్ విధానాన్ని’ యథాతథంగా కొనసాగించేందుకు వారు అంగీకరించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో విడుదల కాబోతున్న పలు భారీ చిత్రాలకు భారీ ఊరట లభించినట్లయింది.
శాశ్వత పరిష్కారానికి కమిటీ:
కేవలం తాత్కాలిక ఉపశమనమే కాకుండా.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చిరంజీవి దిశా నిర్దేశం చేశారు. జూన్ 30వ తేదీలోపు ‘పర్సెంటేజ్ విధానం’పై ఫిల్మ్ ఛాంబర్ కమిటీ ద్వారా చర్చలు జరిపి, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన, న్యాయమైన నిర్ణయాన్ని తీసుకుంటామని చిరంజీవి భరోసా ఇచ్చారు.
* చిరు చొరవపై టాలీవుడ్ హర్షం…
పరిశ్రమలో తలెత్తిన పెద్ద సంక్షోభాన్ని అతి తక్కువ సమయంలో, సామరస్యపూర్వకంగా పరిష్కరించిన మెగాస్టార్ చిరంజీవిపై టాలీవుడ్ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి నిజమైన ‘బాస్’ అనిపించుకున్నారని, చిరు చొరవ వల్ల పరిశ్రమలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొందని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
