Govardhanagiri Narasayya Sharma Passed Away
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో విషాదం నెలకొంది. స్థానిక శ్రీ సాంబమూర్తి దేవాలయం (శివాలయం) లో సుదీర్ఘకాలంగా పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్న ప్రముఖ అర్చకులు గోవర్ధనగిరి నరసయ్య శర్మ (75) ఆదివారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. తరతరాలుగా వస్తున్న తమ వంశపారంపర్య సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఆయన ఈ శివాలయంలో వంశోద్ధారక అర్చకుడిగా బాధ్యతలు చేపట్టారు. కేవలం ఒక పూజారిగానే కాకుండా, స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ, ఆలయ పవిత్రతను కాపాడటంలో ఆయన తనదైన పాత్రను పోషించారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడిని ఆప్యాయంగా పలకరిస్తూ, వేద ఆశీర్వచనాలను అందిస్తూ వారి హృదయాలలో భక్తిభావాన్ని నింపుతూ సన్మార్గంలో నడిచేలా మార్గదర్శనం చేసి అందరి మన్ననలు పొందారు.
ఆధ్యాత్మిక సేవే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల గ్రామంలోని పౌర గ్రంథాలయ (లైబ్రరీ) అభివృద్ధి కోసం రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. నరసయ్య శర్మ మృతి పట్ల గ్రామస్తులు, భక్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
