Ameerpet Shopping Complex Fire
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాజధాని నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైత్రివనం సమీపంలో ఉన్న ప్రముఖ ‘కేఎస్ఆర్ (KSR) షాపింగ్ కాంప్లెక్స్’లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్‌లోని ఒక బొమ్మల దుకాణంలో మొదలైన మంటలు.. చూస్తుండగానే క్షణాల వ్యవధిలో పక్కనే ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ మాల్ మొత్తానికి వేగంగా వ్యాపించాయి.
* రెండు అంతస్తులకు వ్యాపించిన మంటలు…
ఈ ప్రమాదంలో షాపింగ్ కాంప్లెక్స్‌కు చెందిన రెండు అంతస్తుల్లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మాల్లోని వస్తువులు, దుస్తులు ఇతర సామాగ్రి దహనమవడంతో అమీర్‌పేట్ పరిసర ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న మరికొన్ని షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక స్థానిక వ్యాపారులు, వినియోగదారులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
* రంగంలోకి 4 ఫైర్ ఇంజన్లు…
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొదట రెండు, ఆ తర్వాత మరో రెండు.. మొత్తంగా నాలుగు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బిల్డింగ్ లోపల దట్టమైన పొగ పేరుకుపోవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది.
ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు కలిసి చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
