Huzurabad Uppal Cleanliness Drive
* ఉప్పల్లో స్వచ్ఛ గ్రామం కోసం ప్రజాప్రతినిధులు, యువత శ్రమదానం
* పర్యావరణ సంరక్షణ నిరంతర ఉద్యమం కావాలి
* ఉత్సాహంగా పాల్గొన్న ఉప్పల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం
* అర కిలోమీటర్ మేర రహదారులు శుభ్రం, మురుగు కాలువల పూడికతీత
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని స్వచ్ఛ గ్రామం – సురక్షితమైన గాలి, నీరు కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ శ్రమదానంలో భాగంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి జెండా ఏరియా వరకు అర కిలోమీటర్ పొడవునా ఉన్న ప్రధాన రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు. రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన మురికిని, ప్లాస్టిక్ వ్యర్థాలను, పిచ్చిమొక్కలను ప్రజాప్రతినిధులు,యువత,మహిళలు స్వచ్ఛందంగా తొలగించారు. మురుగు కాలువల్లో పూడికతీత చేపట్టి, నీరు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రమ నాగరాజు ,ఉప సర్పంచ్ మేడిపల్లి సిద్ధార్థ, పంచాయతీ కార్యదర్శిలు మాట్లాడుతూ…. ఈ కార్యక్రమం మన నిత్య జీవితంలో భాగం కావాలని అన్నారు. ఇది నిరంతర పర్యావరణ సంరక్షణ ఉద్యమం అన్నారు. కాగా గ్రామపంచాయతీ పాలకవర్గం చేపట్టిన ఈ కార్యక్రమం పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బైరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మేడిపల్లి సిధార్థ , వార్డు సభ్యులు మోతె రాజేష్, సముద్రాల సదయ్య, మేడిపల్లి రమేష్, వెంగల రవీందర్,పసునూటి రాణా ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూసల గణేష్, యువకులు, మహిళలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
