World Environment Day 2026
* నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్-5)
ఆకేరు న్యూస్, డెస్క్: నిన్న మొన్నటి దాకా మనం అనుభవించిన ఆ నరకప్రాయమైన వేసవిని అంత తేలిగ్గా మర్చిపోగలమా? భానుడి భగభగలకు అల్లాడిపోయాం. ఏసీలు, కూలర్లు ఉన్నా సరే ఇళ్లల్లోంచి బయటపడాలంటేనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. దానికి తోడు ఈ ‘ఎల్ నినో’ (El Niño) ముప్పు మనల్ని ఎలా వెంటాడుతుందో పేపర్లలో, టీవీల్లో రోజూ చూస్తూనే ఉన్నాం.
వాతావరణం మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఎప్పుడు ఎండలు మండుతాయో, ఎప్పుడు అకాల వర్షాలు ముంచెత్తుతాయో తెలియని పరిస్థితి. నిజం చెప్పాలంటే.. ఇదంతా ప్రకృతి మనకు ఇస్తున్న చివరి హెచ్చరిక. “ఇప్పుడైనా మారండిరా బాబూ.. లేదంటే మీ సర్వనాశనాన్ని మీరే కొనితెచ్చుకుంటారు” అని భూమాత నెత్తీ నోరూ బాదుకుని చెప్తున్నట్లు ఉంది ఈ పరిస్థితి.
జూన్ 5 వచ్చుడంటే చాలు.. అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుర్తొచ్చేస్తుంది. ఏటా ఈ రోజున ప్రభుత్వాలు, సంస్థలు, నాయకులు స్టేజీలెక్కి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతారు. చేతిలో ఒక మొక్క పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బాధ్యత తీరిపోయిందని సంబరపడిపోతారు. మరుసటి రోజు నుంచి ఆ మొక్కకు నీళ్లు పోసే నాథుడే ఉండడు. ఈ ఒకరోజు నాటకాలకు స్వస్తి పలకాల్సిన సమయం దాటిపోయింది. మనకు కావాల్సింది ఫొటోల కోసం నాటే మొక్కలు కాదు.. ప్రాణం పోసే వృక్షాలు.
గాంధీజీ ఆనాడే చెప్పారు… “ప్రకృతి మన అవసరాలను తీర్చగలదు, కానీ మన స్వార్థాన్ని కాదు.” ఎంత నిజం! మన అవసరాల కోసం చెట్లను కొట్టాం, అడవులను నరికేశాం, నదులను కలుషితం చేశాం, కొండలను సైతం పిండి చేసేశాం. ఎటు చూసినా కాంక్రీట్ జంగిల్స్ లేచాయి. ఏసీల నుంచి వచ్చే చల్లదనం కోసం బయట వాతావరణాన్ని తగలబెట్టేస్తున్నాం. ఇదంతా ఎవరి కోసం? మన స్వార్థం కోసమే కదా! మనం చేసిన పాపమే ఇప్పుడు వేసవి తీవ్రత రూపంలో, తాగునీటి ఎద్దడి రూపంలో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రకృతిని మనం దోచుకుంటూ పోతే, అది తిరిగి మనపై పగ తీర్చుకోవడం ఖాయం.
* మన పిల్లలకు ఆస్తులు కాదు శ్వాసించే గాలిని ఇద్దాం…
మనం పగలు రాత్రి కష్టపడి సంపాదిస్తున్నాం. పిల్లల పేరిట బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ప్లాట్లు, బిల్డింగ్లు రాసి పెడుతున్నాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి.. భవిష్యత్తులో మన పిల్లలు శ్వాసించడానికి స్వచ్ఛమైన గాలి లేకపోతే, తాగడానికి చుక్క మంచి నీరు దొరకకపోతే.. మనం ఇచ్చే కోట్ల రూపాయల ఆస్తులు వారి ప్రాణాలను కాపాడగలవా? డబ్బులు పెడితే హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ దొరుకుతుందేమో కానీ, బ్రతకడానికి కావలసిన ప్రాణవాయువు ప్రకృతిలోనే దొరకాలి. భావితరాలకు మనం ఇవ్వాల్సిన అసలైన ఆస్తి.. పచ్చని పర్యావరణం, కాలుష్యం లేని గాలి. అది ఇవ్వలేనప్పుడు మనం సంపాదించే సంపాదన అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
* మాటలు చాలు.. ఇక చేతల్లో చూపిద్దాం..
ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేవలం వాట్సాప్ స్టేటస్లు పెట్టి ఊరుకోవద్దు. ప్రతి ఒక్కరం కంకణబద్ధులవుదాం. మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, పుట్టినరోజు వచ్చినా.. గుర్తుగా ఒక మొక్క నాటుదాం. దాన్ని మన పిల్లలకంటే జాగ్రత్తగా కాపాడుదాం. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిద్దాం. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుందాం.
* గుర్తుంచుకుందాం:
చెట్లను పెంచడం అంటే ప్రగతిని కాపాడుకోవడమే. చెట్లను కాపాడుకుంటేనే మన జీవం నిలబడుతుంది. ఇప్పుడైనా మన అలవాట్లను మార్చుకోకపోతే, రాబోయే తరాలు మనల్ని క్షమించవు. మన భూమిని, మన పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది!
Please tell us what is wrong. Your report will be sent to the website team.
