Sheetla Bhavani Festival Telangana
* గిరిజనుల అతిపెద్ద పండుగ
ఆకేరు న్యూస్, డెస్క్: బంజారా (లంబాడా) గిరిజనుల విలక్షణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే ‘శీత్ల భవాని’ (శీత్ల) పండుగ తెలంగాణవ్యాప్తంగా ఉన్న తండాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రకృతిని దైవంగా భావించే గిరిజనులు, తమ పశుసంపదను, గ్రామాన్ని సకల రోగాల నుండి రక్షించుకునేందుకు ఈ సాంప్రదాయ ఉత్సవాన్ని ఏటా ఆషాఢ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలు తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని బంజారా తండాలలో ఉమ్మడిగా సాగుతాయి. ముఖ్యంగా గ్రామానికి నైరుతి దిశలో ఉన్న ఊరి పొలిమేరల్లో, చెట్ల నీడన తాత్కాలికంగా ‘శీత్ల భవాని’ దేవతలను ప్రతిష్ఠిస్తారు. తండాలోని ఇళ్లన్నీ మూసివేసి, అబాలగోపాలం అంతా ఈ పొలిమేర ప్రాంతానికి తరలివచ్చి పండుగలో భాగస్వాములవుతారు.
* ఆషాఢ మాసంలో ఈ పండుగ..
ఏటా రుతుపవనాల రాకతో, వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను నిర్వహిస్తారు. సాధారణంగా జూన్ చివరి వారం లేదా జూలై మాసాల్లో, తండా పెద్దలు (నాయక్, కర్భారీ, డావ్) అందరూ కలిసి ఒక శుభ ముహూర్తాన్ని (ఆదివారం లేదా మంగళవారం) ఖరారు చేస్తారు. వర్షాలు పడి వ్యవసాయ పనులు ఊపందుకునే ముందే ఈ పూజలు ముగించడం ఆనవాయితీ.
* ప్రాముఖ్యత..
వర్షాకాలంలో పశువులకు వచ్చే గాలికుంటు రోగం, సబ్బ రోగంతో పాటు మనుషులకు సోకే కలరా, మశూచి, మలేరియా వంటి అంటువ్యాధుల నుండి రక్షణ పొందడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.
* ఆరోగ్య రక్షణ..
శీత్ల భవాని అంటే చల్లని తల్లి అని అర్థం. ప్రకృతి ప్రకోపానికి గురికాకుండా, తండాలోని ప్రజలంతా చల్లగా ఉండాలని కోరుకుంటారు.
పశుసంపద రక్షణ…
గిరిజనులకు పశువులే జీవనాధారం. అందుకే తమ పశుగ్రాసానికి, పశువుల ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేకుండా చూడాలని ‘సాతీ భవానీల’ను (ఏడుగురు దేవతలు) వేడుకుంటారు.
* పూజా విధానం & విశేషాలు..
శీత్ల పండుగ నిర్వహణలో బంజారాల సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఈ పండుగను పూర్తిగా ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో జరుపుకుంటారు.
ఏడుగురు దేవతలు)… పొలిమేరల్లో ఏడు చిన్న రాళ్లను తెచ్చి, వాటికి పసుపు, కుంకుమలు అద్ది ఏడుగురు దేవతలుగా భావిస్తూ ప్రతిష్ఠిస్తారు. వీరే శీత్ల, మేరమ్మ, మంత్రల్, సీత్ల, త్వాళ్, కాళికా మరియు దేవలమ్మ. వీరితో పాటు రక్షణగా ‘లాంకెడియా’ (రక్షకుడు) రూపంలో ఒక పెద్ద రాయిని నిలుపుతారు.
* ఘటాల ఊరేగింపు..
తండాలోని మహిళలు సాంప్రదాయ లంగా-ఓణీ, రంగురంగుల దుస్తులు, వెండి ఆభరణాలు ధరించి, తలపై ‘ఘటాల’ను (నైవేద్య బోనాలు) పెట్టుకుని నృత్యాలు చేస్తూ పొలిమేరలకు చేరుకుంటారు.
* ‘లాపసి’ నైవేద్యం..
బెల్లం, గోధుమ రవ్వతో చేసిన ‘లాపసి’ (ఒక రకమైన పాయసం) మరియు నెయ్యిని దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు.
జీవాల బలి & దాటడం… మొక్కులు ఉన్న భక్తులు మేకపోతులు, కోళ్లను బలి ఇస్తారు. అనంతరం బలి ఇచ్చిన పశువుల రక్తాన్ని తండాలోని పశువుల కాళ్లకు రాస్తారు. చివరగా, ప్రతిష్ఠించిన దేవతల ముందు గిరిజన యువకులు అడ్డంగా పడుకోగా, వారిపై నుండి తండాలోని పశువులన్నింటినీ దాటిస్తారు. ఇలా చేయడం వల్ల పశువులకు ఎలాంటి దిష్టి తగలదని, వ్యాధులు రావని వారి నమ్మకం.
* శీత్ల పండుగ సమాజ శ్రేయస్సు కోసం..
ఆధునిక కాలంలో ఎన్ని మార్పులు వచ్చినా, బంజారాలు తమ పూర్వీకుల నాటి సాంప్రదాయాన్ని విస్మరించకుండా శీత్ల పండుగను సమాజ శ్రేయస్సు కోసం జరుపుకోవడం విశేషం. గిరిజన సంస్కృతిలోని ఐక్యతకు, ప్రకృతి-మానవ సంబంధానికి ఈ పండుగ ఒక సజీవ సాక్ష్యం.
