Telangana Gurukul Ragging Incident
* గురుకులంలో ర్యాగింగ్…
* కళ్లకు గంతలు కట్టి, పెన్ క్యాప్ మింగించారు
ఆకేరు న్యూస్, కొమురం భీమ్ ఆసిఫాబాద్: తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఘోరమైన ర్యాగింగ్ ఉదంతం వెలుగుచూసింది. తోటి విద్యార్థినులే ఒక బాలికపై అమానుషంగా ప్రవర్తించి, ప్రాణాల మీదికి తెచ్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
* కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా మింగించి..
కాగజ్‌నగర్ మండలం దరిగాం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఉషాన్ శృతి అనే విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అయితే, అదే పాఠశాలకు చెందిన కొందరు తోటి విద్యార్థినులు శృతిపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, బాలిక కళ్లకు గంతలు కట్టి, కాళ్లు చేతులు కదలకుండా గట్టిగా బిగించి పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె నోట్లో ఒక పెన్ క్యాప్ వేసి, బలవంతంగా నీళ్లు పోసి మింగించారు.
* స్కానింగ్‌లో బయటపడ్డ పెన్ క్యాప్..
బాధిత విద్యార్థిని పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసరంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా, బాలిక కడుపులో పెన్ క్యాప్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు, శృతికి ప్రత్యేక చికిత్స అందించి కడుపులో ఉన్న పెన్ క్యాప్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
* పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…
ఈ భయానక ర్యాగింగ్ ఘటనపై సమాచారం అందుకున్న బాలిక తండ్రి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన విద్యార్థినులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గురుకుల పాఠశాలలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
