HANAMKONDA MONSOON DELAY
ఆకేరు న్యూస్, హన్మకొండ: హన్మకొండ జిల్లాలో ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం మందగించడంతో వర్షపాతం తీవ్రంగా పడిపోయింది. జూలై 6, 2026 నాటికి నమోదైన అధికారిక గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతంలో ఏకంగా 53 శాతం లోటు కనిపిస్తుండటంతో కరువు పరిస్థితులు ముంచుకొస్తున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* ఈ ఒక్క రోజే 99 శాతం లోటు..
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూలై 6వ తేదీన (ఈరోజు) జిల్లా వ్యాప్తంగా కేవలం 0.1 మి.మీ సగటు వర్షపాతం మాత్రమే నమోదైంది. నిజానికి ఈ సమయానికి సాధారణ వర్షపాతం 8.5 మి.మీ ఉండాలి. అంటే ఈ ఒక్క రోజే ఏకంగా 99 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. కమలాపూర్ (0.5 మి.మీ), పరకాల (0.3 మి.మీ) మినహా మిగిలిన 12 మండలాల్లో నేడు అసలు వర్షపు చుక్క కూడా పడలేదు.
* కరుణించని వరుణుడు, సగానికి పైగా తగ్గిన వర్షం..
సీజన్ ప్రారంభం నుండి నేటి వరకు జిల్లాలో సాధారణంగా 180.6 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 84.9 మి.మీ మాత్రమే నమోదైంది. జిల్లాలోని మొత్తం 14 మండలాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైన మండలాలు ఒక్కటి కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
సాధారణం కంటే తక్కువ (Deficient) ఉన్న మండలాలు- 9
అంతలా వర్షపాతం (Large Deficient) ఉన్న మండలాలు- 5
* తీవ్రంగా నష్టపోయిన ప్రధాన మండలాలు
జిల్లాలో ఐదు మండలాల్లో వర్షపాత లోటు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎల్కతుర్తి మండలంలో అత్యధికంగా 77 శాతం లోటు నమోదైంది. ఇక్కడ సాధారణంగా 172.0 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 38.8 మి.మీ మాత్రమే కురిసింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆత్మకూరు 72 శాతం లోటు (సాధారణం: 201.7 మి.మీ, కురిసింది. 56.7 మి.మీ), హసన్పర్తి 69 శాతం లోటు (సాధారణం: 181.3 మి.మీ, కురిసింది: 56.6 మి.మీ) ఉన్నాయి. జిల్లా కేంద్రమైన హన్మకొండలో 67 శాతం (సాధారణం: 190.7 మి.మీ, కురిసింది: 63.8 మి.మీ), ఖాజీపేటలో 60 శాతం (సాధారణం: 178.7 మి.మీ, కురిసింది: 70.9 మి.మీ) లోటు వర్షపాతం నమోదైంది.
మిగిలిన మండలాలైన భీమదేవరపల్లి (-50%), వేలేరు (-47%), ధర్మసాగర్ (-45%), దామెర (-50%), శాయంపేట (-53%), నడికూడ (-44%), పరకాల (-45%) లలో కూడా వర్షపాతం సగటు కంటే సగానికి పడిపోయింది. కమలాపూర్, ఇనవోలు మండలాల్లో అత్యల్పంగా 29 శాతం లోటు ఉన్నప్పటికీ, అది కూడా లోటు వర్షపాత శ్రేణిలోనే కొనసాగుతోంది.
* వ్యవసాయ నిపుణుల హెచ్చరిక..
ఖరీఫ్ సాగు ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవడంతో విత్తనాలు వేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, ఇప్పటికే జరిగిన ఆలస్యం వల్ల పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ప్రత్యామ్నాయ ప్రణాళికలు కావాలంటున్న రైతాంగం
వర్షాలు లేక పొలాలు ఎండిపోతుండటంతో పెట్టిన పెట్టుబడులు ఎక్కడ మునిగిపోతాయోనని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తీవ్రమైన లోటు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రూపొందించాలని, తక్కువ నీటితో పండే పంటల విత్తనాలను సబ్సిడీపై సిద్ధం చేసి రైతులకు అందించాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
