Konda Surekha Letter
* సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ లేఖ
* నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర
ఆకేరు న్యూస్ ప్రతినిధి, వరంగల్ :
తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉద్యేశ పూర్వకంగా కుట్రలు చేస్తున్నారని దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో కడియం శ్రీహరి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి, తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కడియం శ్రీహరి ప్రయత్నించారని మంత్రి కొండా సురేఖ లేఖలో గుర్తుచేశారు. పార్టీ అధిష్టానానికి తనపై ఉన్న నమ్మకం వల్లే నాడు ఆయన కుటిల ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి మంత్రి అధికార పరిధిని బలహీనపరిచేలా, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనవసర జోక్యం చేసుకునేలా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇటువంటి చర్యలు అధికార యంత్రాంగంలో అయోమయ పరిస్థితులను సృష్టిస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన పరిధిలోని శాఖా వ్యవహారాల్లో తనకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే స్థాయిలో కడియం శ్రీహరి హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారిక సమీక్ష నిర్వహించడంపై ఆమె ఆ లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
* నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర
సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయం విడుదల చేసిన ప్రెస్ నోట్లో మాస్టర్ ప్లాన్ ల రూపకల్పన, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, దేవాలయ భూముల పరిరక్షణ, నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించడం వంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మంత్రి స్థాయిలో నిర్ణయించాల్సిన అంశాలు. ఇది సాధారణ పరిపాలనా లోపం కాదు, శాఖా మంత్రి అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నం కడియం శ్రీహరి చేశారన్నారు. శాఖ కు సంబందించి మంత్రిని లేకుండా సమీక్షలు చేయకూడదని ఎంతో రాజకీయ అనుభవం కలిగిన కడియం శ్రీహరికి ఈ విషయాలు తెలియనివి కావన్నారు, నన్ను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారన్నారు.
* క్రమశిక్షణా చర్యలు తీసుకోండి
తనకు సమాచారం ఇవ్వకుండా సమీక్ష నిర్వహించిన అంశంపై కడియం శ్రీహరి నుంచి వివరణ కోరాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వ పరిపాలనా విధానాలు, శాఖా మంత్రుల రాజ్యాంగబద్ధ అధికారాలను గౌరవించే విధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారం పార్టీ క్రమశిక్షణతో పాటు ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశం కాబట్టి, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు.



———————————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
