KU Student Sandhya Reddy appreciated by telangana Governor shiv pratap shukla
* లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన కేయూ విద్యార్థిని
* ‘నారీ శక్తి వందన్’ అంశంపై ప్రశంసలు..
ఆకేరు న్యూస్, వరంగల్:
కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ విద్యార్థిని, ఎన్ఎస్ఎస్ బయోటెక్నాలజీ యూనిట్ వాలంటీర్ బారెడ్డి సంధ్యారెడ్డి ( B SANDHYA REDDY ) తెలంగాణ గవర్నర్ ప్రశంసలు అందుకున్నారు.
వికసిత్ భారత్ యువ పార్లమెంట్ (VBYP), వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ (VVVP) ప్రతినిధులతో కలిసి హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా యువ పార్లమెంట్లో సంధ్యారెడ్డి ప్రస్తావించిన “నారీ శక్తి వందన్ – మహిళా సాధికారత” అంశాన్ని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.
యువతలో సామాజిక చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా ఆమె చేసిన కృషిని ప్రశంసించారు.

సంధ్యారెడ్డి మాట్లాడుతూ, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతతో కలిసి పనిచేసిన అనుభవం తనలో “భిన్నత్వంలో ఏకత్వం” అనే భారతీయ విలువపై మరింత విశ్వాసాన్ని పెంచిందన్నారు.
వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గవర్నర్ను కలిసిన ఈ అవకాశం తనకు మరింత స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలు, నాయకత్వం, సమాజ సేవ ద్వారా దేశాభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ బయోటెక్నాలజీ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. రాధికా తిప్పని మాట్లాడుతూ, సంధ్యారెడ్డి సాధించిన ఈ గౌరవం కాకతీయ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని అన్నారు.
బయోటెక్నాలజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ నిరంతర కృషి, సమర్థ మార్గదర్శకత్వం ఫలితంగానే లోక్ భవన్లో గవర్నర్ను కలిసే అవకాశాన్ని పొందిన రెండవ విద్యార్థిగా సంధ్యారెడ్డి నిలిచారని, ఇది తెలంగాణలోని విశ్వవిద్యాలయాల బయోటెక్నాలజీ ఎన్ఎస్ఎస్ యూనిట్లకు మరో విశిష్ట ఘనత అని పేర్కొన్నారు.
బయోటెక్నాలజీ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సంధ్యారెడ్డికి అభినందనలు తెలియజేస్తూ, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

