Shabad Murder Accused Reward
ఆకేరు న్యూస్, రంగారెడ్డి: షాబాద్ పరిధిలో ఆరుగురి దారుణ హత్య ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో ఉన్నతాధికారులు కీలక చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ షాబాద్ సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
* పోలీసుల నిర్లక్ష్యమే శాపమైందా..
గతంలోనే ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు రాజ్‌కుమార్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, పోలీసులు అతడిని సకాలంలో అరెస్ట్ చేయకపోవడమే ఈ ఘోరానికి దారితీసిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడు రాజ్‌కుమార్‌కు కొందరు పోలీసులు పరోక్షంగా సహకరించడం వల్లే ఈ దారుణం జరిగిందని వారు వాపోతున్నారు. ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకున్నప్పటికీ, తమకు జరిగిన అన్యాయానికి బాధ్యులెవరని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
* నిందితుడిపై రూ. 2 లక్షల రివార్డ్..
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి లేదా అతడిని పట్టుకోవడానికి సహకరించిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి (రివార్డ్) అందజేస్తామని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
