SI Child Driving Incident
* ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్ చేయించిన ఎస్ఐ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి, అత్యంత ప్రమాదకర రీతిలో ప్రవర్తించిన ఘటన సైబరాబాద్ పరిధిలో కలకలం రేపింది. కేవలం ఆరేళ్ల వయసున్న తన మనవరాలి చేతికి కారు స్టీరింగ్ ఇచ్చి రోడ్డుపై డ్రైవింగ్ చేయించిన సైబరాబాద్ కమిషనరేట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) పూజారి తిరుపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* డ్రైవింగ్ సీట్లో చిన్నారి…
సైబరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంధంగూడ రోడ్డుపై ఒక కారు అస్తవ్యస్తంగా వెళ్తుండటాన్ని గమనించిన తోటి వాహనదారులు షాక్‌కు గురయ్యారు. కారు డ్రైవింగ్ సీట్లో ఒక చిన్నారి కూర్చుని స్టీరింగ్ తిప్పుతుండగా, పక్కనే ఉన్న వ్యక్తి ఆమెకు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. దీంతో ప్రమాదం జరుగుతుందని గమనించిన వాహనదారులు, కారును అడ్డుకుని నిలదీశారు.
* ఆటోమేటిక్ కార్ అంటూ బుకాయింపు..
కారులో ఉన్నది సైబరాబాద్ కమిషనరేట్ ఎస్ఐ పూజారి తిరుపతి అని తేలింది. జనం నిలదీయడంతో ఆయన తప్పును ఒప్పుకోకుండా బుకాయించే ప్రయత్నం చేశారు. “ఇది ఆటోమేటిక్ కారు.. అందుకే ఇచ్చాను” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ తతంగాన్నంతటినీ అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు.
* పోలీసుల యాక్షన్..
చిన్నారితో కారు డ్రైవింగ్ చేయించిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. తీవ్ర వివాదాస్పదంగా మారిన ఈ ఘటనపై నార్సింగి పోలీసులు స్పందించారు. రహదారిపై ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందుకు గానూ ఎస్ఐ పూజారి తిరుపతిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
