Chittoor Husband Murder Case
* హత్య చేసి భర్త బైక్‌పైనే పరార్
ఆకేరు న్యూస్, డెస్క్: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో ఎలా చిచ్చు పెడుతున్నాయో చెప్పడానికి మరో దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. కట్టుకున్న భర్త తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఓ భార్య, ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా అతడిని అంతమొందించింది. ఈ విషాదకర ఘటన గుడుపల్లె మండలంలో చోటుచేసుకుంది.
* కథనంలోకి వెళ్తే..
తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్ హోసూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల కిందట కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో అతనికి వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న మౌలికశ్రీ అనే కుమార్తె ఉంది. అయితే, హాసినికి అప్పటికే యుగంధర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భర్తను వదిలించుకోవాలని హాసిని పక్కా స్కెచ్ వేసింది.
* పర్స్ పడిపోయిందంటూ డ్రామా..
సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్దామని భర్త రమేష్‌ను హాసిని ఒప్పించింది. ప్లాన్ ప్రకారం భర్త, పాపతో కలిసి బైక్‌పై ఆలయానికి బయల్దేరింది. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఘాట్ రోడ్డు సమీపంలో హాసిని ఉద్దేశపూర్వకంగా తన పర్సును కింద పడేసింది. కొంత దూరం వెళ్లాక పర్స్ పోయిందని భర్తకు చెప్పడంతో, రమేష్ దానిని వెతుక్కుంటూ వెనుకకు వెళ్లాడు.
* కాపుకాసి దాడి.. భర్త బైక్‌పైనే పరార్…
అప్పటికే అక్కడ పొంచి ఉన్న హాసిని ప్రియుడు యుగంధర్, అతని స్నేహితులు రమేష్‌పై ఒక్కసారిగా దాడి చేసి ఘాతుకానికి ఒడిగట్టారు. రమేష్‌ను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశారు. అనంతరం రమేష్ తెచ్చిన బైక్‌పైనే హాసిని, ఆమె ప్రియుడు, మరో నిందితుడు కలిసి రైల్వే స్టేషన్‌కు పారిపోయారు.
* పోలీసుల ఎంట్రీ.. సీసీటీవీల్లో గుట్టురట్టు..
రాత్రి దాటినా కూతురు, అల్లుడు ఇంటికి రాకపోవడంతో హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. వెళ్లేటప్పుడు భర్తతో వెళ్లిన హాసిని, తిరుగు ప్రయాణంలో మాత్రం భర్త బైక్‌పై ఇద్దరు యువకులతో కలిసి వెళ్తుండటాన్ని పోలీసులు గుర్తించారు.
దీంతో హాసినిపై అనుమానంతో విచారించగా అసలు నిజం బయటపడింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో రమేష్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్నకూతురిని సైతం లెక్కచేయకుండా ప్రియుడి కోసం భర్తను చంపిన హాసిని ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
