Medaram Development Seethakka Review
* తెనేటీగల పెంపకం పై శిక్షణ కార్యక్రమం ప్రారంభం.
* మేడారం పాఠశాలలో వనమహోత్సవం.
* పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్, ములుగు:
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పరిసరాలలో మాస్టర్ ప్లాన్ తో చేపడుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గురువారం మేడారం హరిత హోటల్లో మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించి ఆదేశించారు.
మేడారం లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భక్తులకు మెరుగైన సౌకర్యాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి, పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
మొదట తాడ్వాయి మండలం గొనెపల్లి గ్రామంలో రాష్ట్రమంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ తో కలిసి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళాశక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా హంబుల్ బీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మక్క–సారక్క మండల సమాఖ్య పరిధిలోని వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తాడ్వాయి మండలం మేడారం లోని ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాల లో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ తో కలిసి వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు .వన మహోత్సవ విశిష్టతను విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,జిల్లా అధికారులు, స్థానిక సర్పంచ్, పూజారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
