SRSP WATER RELEASE DEMAND AND BRS PROTEST
ఆకేరు న్యూస్,రాయపర్తి:
ఎస్ఆర్ఎస్పి (SRSP) కెనాల్ నీటిని తక్షణమే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని, అలాగే వ్యవసాయానికి గతంలో వలె 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రాయపర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వందలాది మంది రైతులు, పార్టీ శ్రేణులు స్థానిక జాతీయ రహదారిపైకి చేరుకుని బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ రాస్తారోకో వల్ల జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
* పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఈ సందర్భంగా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ బిఆర్ఎస్ జిల్లా నాయకులు పరు పాటి శ్రీనివాస్ రెడ్డి మరియు మండల ముఖ్య నాయకులు మాట్లాడుతూ…
”నీరు లేక, కరెంట్ సరిగ్గా రాక చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి అండగా నిలిచారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు
అనంతరం నాయకులు, రైతులు భారీ ర్యాలీగా స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్‌కు చేరుకున్నారు. సబ్ స్టేషన్‌ను ముట్టడించి లోపలికి వెళ్లిన ఆందోళనకారులు, అక్కడి అధికారులను నిలదీశారు.
* త్రీ-ఫేజ్ కరెంట్ కొరత
నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి, క్షేత్రస్థాయిలో కరెంట్ కోతలతో రైతులను వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లో-ఓల్టేజీ సమస్య వల్ల మోటార్లు కాలిపోయి రైతులు అదనపు ఆర్థిక భారానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం స్పందించి సాగునీరు విడుదల చేయకపోతే మరియు 24 గంటల విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపదని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు మరియు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
