cm revanth reddy Education Reforms Telangana
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులను నేరుగా స్కిల్స్ (నైపుణ్యాల) వైపు మళ్లించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న టీచర్లతో హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ (MCR HRD) దాశరథి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన “టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్” ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా విధానంలో మార్పులు, ఉపాధ్యాయుల బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
* గ్లోబల్ విజన్ – జర్మనీ, జపాన్ దేశాలపై ఫోకస్..
“గడిచిన 25 ఏళ్లుగా మనం అమెరికా వైపు చూశాం. ఇకపై మన ఫోకస్ జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, చైనా వంటి దేశాలపై ఉండాలి. అక్కడ నైపుణ్యం ఉన్న యువతకు లక్షలాది రూపాయల జీతాలతో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.”
వైట్ కాలర్ ఉద్యోగాలతో పాటు బ్లూ కాలర్ ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని, విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాథమిక భాషా పరిజ్ఞానం అందిస్తే గ్లోబల్ స్థాయిలో రాణిస్తారని సీఎం స్పష్టం చేశారు.
* “మీ సమస్యలు మాకు వదిలేయండి.. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దండి”
ఉపాధ్యాయ సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు అడగకుండానే బదిలీలు, ప్రమోషన్లు నేరుగా మీ ఇంటికి పంపాం. డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలను కేవలం 55 రోజుల్లోనే భర్తీ చేశాం. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. ఉపాధ్యాయ సంఘాలు కేవలం పిల్లల సమస్యలపైనే ప్రభుత్వంతో కొట్లాడాలి” అని పిలుపునిచ్చారు.
* ప్రతి మండలం ఒక క్లస్టర్ – డిసెంబర్ నాటికి నివేదిక
వచ్చే విద్యా సంవత్సరానికి విద్యా వ్యవస్థలో తీసుకోవాల్సిన మార్పులపై డిసెంబరులోగా సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
* విద్యారంగంపై ప్రభుత్వం రూ. 1.08 లక్షల ఖర్చు
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం కేటాయించిందని, రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థుల్లో ఒక్కొక్కరిపై ఏడాదికి రూ. 1.08 లక్షలు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
“గత మూడేళ్లలో సర్కారీ బడుల్లో చేరికలు పెరిగాయి. ఈ ఒక్క ఏడాదే లక్షకు పైగా అడ్మిషన్లు నమోదయ్యాయి. మీ కష్టంతో విద్యా రంగంలో దేశంలోనే 28వ స్థానంలో ఉన్న తెలంగాణ 18వ స్థానానికి చేరింది” అని టీచర్లను అభినందించారు.
* సంక్షేమ పథకాల కంటే ‘విద్యే’ శాశ్వత మార్పు
“ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఉచితంగా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. కానీ అవన్నీ తాత్కాలికమే. ఒక కుటుంబంలో ఒకరిని డాక్టర్‌గానో, ఇంజనీర్‌గానో తయారుచేస్తే ఆ కుటుంబం సొంత కాళ్లపై నిలబడుతుంది. ఆ శక్తి ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
ఈ సమావేశానికి ముందు ఫిన్లాండ్, జర్మనీలలో అధ్యయనం చేసిన టీచర్ల బృందం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
