Bhupalpally Gas Leak Fire
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల పరిధిలోని ములుగుపల్లి గ్రామంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వంట గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, గ్రామ ఉప సర్పంచ్ మండపు లక్ష్మిమల్లు నివాస గృహం పూర్తిగా దగ్ధమైంది.
* స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
ఉప సర్పంచ్ మండపు లక్ష్మిమల్లు ఇంట్లో గురువారం ఉదయం వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ నుండి ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజీ ఏర్పడింది. లీకేజీని గమనించేలోపే మంటలు వేగంగా పక్కనే ఉన్న వస్తువులకు అంటుకుని, ఇల్లంతా విస్తరించాయి. మంటల తీవ్రతకు భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో తృప్తిలో ప్రాణపాయం తప్పింది.
అయితే, మంటలు దట్టంగా చెలరేగడంతో ఇంట్లోని నిత్యావసర వస్తువులు, బంగారు ఆభరణాలు, నగదు, ముఖ్యమైన ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్థానికులు, గ్రామస్థులు వెంటనే స్పందించి నీటితో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న రెవెన్యూ మరియు అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే వివరాలపై అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డ ఉప సర్పంచ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, పరిహారం అందించి నివాస వసతి కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
