World Left Handers Day. AI Generated Image
* నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే
ఆకేరు న్యూస్, ప్రత్యేక కథనం :
లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా పలుచోట్ల ఎడమ చేతి వారిని సత్కరించి, బహుమతులు అందజేస్తారు. మరికొన్ని చోట్ల వేడుకలు నిర్వహిస్తారు. కుడిచేతిని శుభప్రదంగా భావించే ఈ దేశంలో ఎడమచేతి వాటం ఉన్నవాళ్లకు ప్రత్యేకంగా ఓ డే(ఆగష్టు 13)ను కేటాయించడం అది వారి ప్రత్యేకతకు గుర్తింపుగా భావిస్తారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఎడమ చేతితో విలన్ని చితక్కొట్టడం, తెలుగు హస్యనటి సూర్యకాంతం ఎడమ చేతిలో అట్లకాడ పట్టుకుని చేసిన హస్యం ఎవరూ మరువలేరు. ఎడమ చేతిని ఉపయోగించే వారికి సృజనాత్మకత, ఐక్యూ అధికంగా వుంటాయని సర్వేలు చెబుతున్నాయి.
* ప్రముఖుల్లో చాలా మందిది ఎడమచేతి వాటమే
ఎడమచేతి వాటం ఉన్న వాళ్లలో చాలా మంది కీలక నేతలు ఉన్నారు. శాస్త్ర, సామాజిక, ఆర్థిక రంగాల్లో గుర్తింపు పొందిన వారూ ఉన్నారు. జాతిపిత మహాత్మగాంధీ కూడా లెఫ్ట్ హ్యాండర్ కావడం గమనించాల్సిన అంశం. ఆయన కాకుండా, చార్లెస్ డార్విన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, న్యూటన్, బిల్‌క్లింటన్, బెంజమిన్ ప్రాంక్లిన్, జార్జి బుష్, ఒబామా, జస్టిన్ బీబర్, సింగర్ లేడీ గాగా, రతన్‌టాటా, అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, మహానటి, సూర్యకాంతం, సావిత్రి, మమ్ముట్టి.. ఇలా పోతే ఆ లిస్టు చాలానే ఉంటుంది.
* ఎడమ చేత్తో సెంచరీలు
ఎందరో క్రికెట్ క్రీడాకారులు ఎడమ చేత్తో సెంచరీలో కొట్టారు. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్లుగా గుర్తింపు పొందారు. క్రికెట్ జట్టు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, వసీం అక్రమ్, జహీర్ ఖాన్ తదితరులు ఉన్నారు. అలాగే ప్రపంచ ప్రసిద్ధ స్పానిష్ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ టెన్నిస్ కోర్టులో ఎడమ చేతితో అద్భుతాలు సృష్టించారు.
* సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
అమెరికాలోని సెంట్ లారెన్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఎడమ చేతి వాటం గలవారిపై ఒక సర్వే నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా చాలా మంది ఎడమ చేతి వాటం ఉన్నవారి ఐక్యూ స్థాయిలు ‘140’ కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే లండన్ విశ్వవిద్యాలయం సర్వే ప్రకారం.. ఎడమ చేతి వాటం గల వ్యక్తులు సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారట. ఒకే సమయంలో రకరకాల ఆలోచనలు చేయడంలో కుడి చేతి వాటం వారి కంటే ముందుంటారని ఈ విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం ఎడమ చేతి వాటం ఉన్నవారు మెదడులోని కుడి మరియు ఎడమ భాగాలను మరింత సమర్థవంతంగా సమన్వయం చేసుకోగలరని, దీనివల్ల వీరికి విషయాలను త్వరగా గ్రహించే శక్తి, జ్ఞాపకశక్తి ఎక్కువని తేలింది.
* ఇబ్బందులూ ఉన్నాయి..
* ఎడమ చేతి వేలికి రింగ్ ఉంటే రాసేటప్పుడు అసౌకర్యంగా ఉంటుంది.
* సాధారణ బాల్ పాయింట్ పెన్నులు కుడి చేతి వాటం వారికి సిరా ప్రవహించేలా డిజైన్ చేయబడి ఉంటాయి. వీటిని ఎడమ చేతితో రాసేటప్పుడు సిరా సరిగ్గా పడకపోవడం లేదా పేపర్‌ను గీసుకుపోవడం జరుగుతుంది.
* సాధారణ కత్తెరల బ్లేడ్ల అమరిక కుడి చేతి వాటం వారికి అనుకూలంగా ఉంటుంది. ఎడమ చేతితో కత్తెర వాడినప్పుడు కాగితం లేదా వస్తువు సరిగ్గా కట్ కాకపోగా, కట్ చేసే లైన్ కూడా స్పష్టంగా కనిపించదు.
* సాధారణంగా కంప్యూటర్ మౌస్‌ను కుడి చేతితో వాడేలా సెట్ చేసి ఉంటారు. దీనిని లెఫ్ట్ హ్యాండ్‌కు మార్చుకోవచ్చు, కానీ పబ్లిక్ కంప్యూటర్లలో ఇది ఇబ్బందిగా మారుతుంది.
* స్కూల్స్, కాలేజీలలో లేదా థియేటర్లలో ఉండే సింగిల్ హ్యాండ్ డెస్క్‌లు కేవలం కుడి చేతి వాటం వారికి మాత్రమే సపోర్ట్ చేసేలా కుడి వైపు ఆర్మ్‌రెస్ట్/డెస్క్ ఉంటాయి. ఎడమ చేతి వాటం విద్యార్థులు కూర్చుని రాయడానికి తీవ్ర ఇబ్బంది పడతారు.
* డైనింగ్ టేబుల్: రద్దీగా ఉండే రెస్టారెంట్లు లేదా ఇళ్లలో డైనింగ్ టేబుల్‌పై కుడి చేతి వాటం వారితో కలిసి భోజనం చేసేటప్పుడు, ఎడమ చేతి వాటం వారి మోచేతులు పక్కవారికి తగిలే అవకాశం ఉంది.
* నాన్న.. నేను.. ఇప్పుడు మనవడు కూడా..
మా నాన్న ఎడమ చేతిని ఉపయోగించి పనులు చేస్తుండేవాడు. నేను అంతే అనుకుంటే మామనమడు కూడా లెఫ్ట హ్యండర్. వారసత్వంగా వచ్చినట్లు వుంది. నగదు లావాదేవిలు చేస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎడమ చేతితో డబ్బు ఇస్తే కుడి చేతితో ఇవ్వమని అడుగుతుంటారు..
– జంపన ప్రతాప్, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు.
* శుభకార్యాల్లో ఇబ్బంది
గుడికి వెళ్లినప్పుడు ప్రసాదం, తీర్ధం తీసుకోవడం వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మన సంప్రదాయం ప్రకారం కుడి చేతితో తీసుకోవాలి. కాని అలవాటు ప్రకారం ఎడమ చేయి వెళుతుంది. మా గృహప్రవేశంలో కూడా ఇబ్బంది అయింది. వీణ వాయించటానికి ఇబ్బంది పడ్డాను. తరువాత అలవాటు అయింది.
– పి. పద్మ, సంగీత టీచర్.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
