* నెల రోజులూ తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం
* హైదరాబాద్ జంట నగరాల్లో మరింత ప్రత్యేకం
* మొదలైన బోనాల సందడి
* ఆగస్టు 4 వరకు జాతరే జాతర
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : భోజనం నుంచి పుట్టిన పదం బోనం. బోనం అంటే అమ్మవారికి సమర్పించే ఆహారం. మహిళలు కొత్త ఇత్తడి లేదా మట్టి కుండలో పాలు, బెల్లంతో అన్నం వండుతారు. కుండను వేప ఆకులు, పసుపుతో అలంకరించి, కుండ పైన దీపం వెలిగించి.. తమ తలపై కుండలను మోస్తూ, ఆలయాలకు చేరుకుంటారు. అమ్మవారికి పసుపు-వెర్మిలియన్, కంకణాలు, చీరలతో పాటు బోనం సమర్పిస్తారు. అలాంటి బోనం అంటే అమ్మకు ప్రియమని నమ్ముతారు. బోనాల జాతర అంటే తెలంగాణలో మస్త్ ఫేమస్. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో పల్లె నుంచి పట్నం వరకు బోనాల పండుగతో ఈ మాసమంతా సందడిగా మారుతుంది. హైదరాబాద్ జంటనగరాల్లో బోనాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బోనం వెనుక ఆరోగ్య ప్రయోజనం
నగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. చారిత్రక గోల్కొండ (Golconda) కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. అయితే పండుగను ఈ సీజన్లోనే జరపడం వెనుక ఓ చరిత్ర ఉంది. రుతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం ప్రారంభంకాగానే మలేరియా, టైఫాయిడ్ తదితర విషజ్వరాలతో పాటు ఇతర సీజనల్ అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ సీజనల్ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు సంబంధం ఉన్నది. వేపాకు క్రిమినాశినిగా పనిచేస్తుంది. అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా.. బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లడం కూడా అందుకే మొదలైందని అంటారు. ఈ పండుగ సందర్భంగా ఇళ్లకు వేపాకు తోరణాలు, గడపలకు పసుపును వినియోగిస్తారు. క్రిమికీటకాల నుంచి ఇవి రక్షణ ఇస్తాయని నమ్ముతారు.
ప్రతి ఘట్టం.. ఆసక్తిదాయకం
బోనాల జాతరలో ప్రతి ఘట్టమూ ఆసక్తిదాయకంగా ఉంటుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించడం, రంగం పేరిట భవిష్యవాణి చెప్పే ఆచారమూ ఈ బోనాల పండుగలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆ ఘట్టాన్ని నిమజ్జనం చేయడం వంటి తంతులు కొనసాగుతాయి. జానపద కళలు, డప్పుల చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. పోతరాజు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాడు. అమ్మవారి సోదరుడిగా, మహిళలకు రక్షకుడిగా పోతరాజును భావిస్తారు. హైదరాబాద్ జంట నగరాల్లో బోనాలు మరింత వైభవంగా కొనసాగుతాయి. గోల్కొండతో మొదలై, సికింద్రాబాద్ మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
తొలిబోనం ఎల్లమ్మకే
ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు ప్రారంభం అవుతాయి. ఈ నెల5న అమావాస్య ఉండడంతో ఆ తర్వాత వచ్చే ఆదివారం నుంచి అంటే 7న జాతర మొదలైంది. గోల్కొండ కోటపై గల శ్రీ జగదాంభిక (గోల్కొండ ఎల్లమ్మ)కు తొలి బోనం సమర్పించిన తర్వాతే తెలంగాణలో బోనాలు ప్రారంభం కావడం సంప్రదాయంగా వస్తోంది. గోల్కొండలో మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ఆలయాలలో బోనాలు ప్రారంభం అవుతాయి. తిరిగి కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాలు సమాప్తం అవుతాయి. కులీకుతుబ్ షాల కాలం నుంచీ ఇది ఆనవాయితీగా వస్తోంది. భద్రాచలం రాములవారి పెళ్లికి ముత్యాల తలంబ్రాలు అందజేసినట్లుగానే ఇక్కడి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తుంది.
ఈ ఏడాది బోనాల పూజలు ఇలా..
జూలై 7న మొదటి పూజ
జూలై 11న రెండో పూజ
జూలై 14న మూడో పూజ
జూలై 18న నాలుగో పూజ
జూలై 21న ఐదో పూజ,
జూలై 25న ఆరో పూజ
జూలై 28న ఏడో పూజ,
ఆగసు 1న ఎనిమిదో పూజ
ఆగస్టు 4న తొమ్మిదో పూజ
——————–